. రాజకీయ పరిశీలకుల వ్యాఖ్యలు
విధాత: ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కనీసం 30 మందిని మార్చి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదని ఒకరంటారు! సీఎంపై సానుకూలత ఉన్నది కానీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నదని మరొకరు సూత్రీకరిస్తారు! 32 మెడికల్ కాలేజీల బదులు 32 యూట్యూబ్ చానళ్లు పెట్టి ఉంటే బాగుండేదని ఎవరో అన్నారని ఇంకొకరు నిట్టూర్చతారు! ప్రజలు గందరగోళానికి గురయ్యారని, కాంగ్రెస్ వలలో పడి ఆ పార్టీకి ఓటేశారని వితండవాదానికి దిగుతున్నవారూ ఉన్నారు! సోషల్ మీడియాలో ప్రజలపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్న గులాబీ శ్రేణులు లెక్కకు మిక్కిలి! వెరసి.. సాకులు వెతుక్కోవడమే తప్పించి.. లోపాన్ని తెలుసుకునేందుకు బీఆరెస్ ప్రయత్నాల్లో ఉన్న సంకేతాలైతే కనిపిండచం లేదు.
ఎమ్మెల్యేలను మార్చినా ఇదే ఫలితం!
బీఆరెస్ నేతలు చెబుతున్నట్టుగా ఎమ్మెల్యేలను మార్చినా ఆ పార్టీకి ఇదే ఫలితం వచ్చి ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు నాయకులు, గులాబీ శ్రేణులు చేస్తున్న విశ్లేషణలపై వారు స్పందిస్తూ.. బీఆరెస్ ఓటమికి ఇవేవీ అసలు కారణాలు కాదని, అసలు కారణం.. ఆ మాటకొస్తే ఏకైక కారణం ఆ పార్టీ అధినేత కేసీఆర్ వ్యవహార శైలేనని స్పష్టం చేస్తున్నారు. మొదటి దఫా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చివరకు పదవి నుంచి దిగిపోయే సమయంలో కూడా అధినేత అహంకారం ఎప్పటికప్పుడు వ్యక్తమవుతూనే వచ్చిందని వారు చెబుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లోనే ఓటమి పునాదులు
2018 ఎన్నికల్లో బీఆరెస్ 97,00,479 ఓట్లు సాధించి, అత్యధిక మెజార్టీతో రెండోసారి అధికారం చేపట్టింది. అప్పుడు మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా నా రాజ్యం… నా ఇష్టం అన్నట్లు వ్యవహరించిన తీరుకు ఆ వెంటనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తమ నిరసన తెలిపారు. ఫలితంగా పార్లమెంటు ఎన్నికల్లో 76,96,848 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. అంటే.. ఏకంగా 20,03,631 లక్షల ఓట్లను కోల్పోయింది. ఇది ఎందుకు జరిగింది? అన్న విషయంలో బీఆరెస్ నాయకత్వం ఆత్మవిమర్శనాపూర్వక సమీక్ష చేసుకున్న దాఖలు లేవు. గుణపాఠం తీసుకున్నదీ లేదు. నిజానికి ఇప్పటి బీఆరెస్ ఓటమికి పునాది అక్కడే పడింది. తదుపరి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీ దెబ్బలే తగిలాయి. ఆనాడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే.. కేసీఆర్ అహంకారపూరిత వైఖరితో వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి. సమ్మెపై ఉక్కుపాదం మోపడమే కాకుండా యూనియన్లను రద్దు చేసేసి.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
పంచాయతీ కార్మికుల సమ్మె విషయంలోనూ అలానే వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం లేదనడానికి నాటి పరిణామాలు నిదర్శనంగా నిలిచాయి. బీఆరెస్‌ను తదుపరి ఎన్నికల్లో ఓడించాలని ఆయా వర్గాల్లో ఆలోచనలు మొదలైనది ఈ పరిణామాల తర్వాతే. బలవంతంగా సమ్మె విరమణ చేయించి, ప్రగతిభవన్‌కు పిలిచి భోజనం పెట్టి, వరాల వర్షం కురిపించినా.. సమ్మెకాలపు పరిస్థితులు, తమ సహ కార్మికుల మరణాలు కార్మికులను వెంటాడుతూనే వచ్చాయి. తాజా ఎన్నికల్లో గుణపాఠం చెప్పే పరిస్థితిని సృష్టించాయి. ధరణి వెబ్సైట్ విషయంలో కూడా కేసీఆర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ధరణి వల్ల ఇబ్బందులను మంత్రులు చెప్పినా వినకుండా మీకు తెలియదులే అన్నతీరుగా నాడు మాట్లాడారన్న చర్చ జరిగింది.
మంత్రుల మాటకు కూడా కనీస విలువ ఇవ్వలేదని, దీంతో ధరణి అనేది గ్రామాల్లో ప్రధాన సమస్యగా మారిందంటున్నారు. అందుకే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న కాంగ్రెస్‌కు రైతులు పట్టం కట్టారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పట్ల నిర్దయగా వ్యవరించారన్న అభిప్రాయం బలంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై పాలాభిషేకాలు చేసేందుకు ఉద్యోగ సంఘాలను వాడుకున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇలా పార్లమెంటు ఎన్నికలు మొదలుకుని ప్రతి దశలో బీఆరెస్‌కు డేంజర్ బెల్స్ మోగుతూనే వచ్చాయి. కానీ.. అవి వినేందుకు కేసీఆర్ ఇష్టపడలేదో.. లేదా చుట్టూ ఉండే జోరీగల శబ్దాల్లో వినిపించలేదో.. మొత్తానికి వాటికి చెల్లించుకున్న మూల్యమే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయమని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతా నా ఇష్టం!
మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, అధికారులైనా కేసీఆర్ చెప్పిందే తప్ప.. సలహాలు ఇవ్వకూడదన్న పరిస్థితి ఆనాడు ఉండేదని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ప్రగతిభవన్‌లోకి మంత్రులకు కూడా అనుమతి లేకుండా చేసిన అంశాలు జనంలోకి కూడా బలంగా వెళ్లాయి. తమ ఎమ్మెల్యేకి, తమ జిల్లా మంత్రి అనుమతి దొరకక పోవడాన్ని ప్రజలు మనసుకు తీసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిర్ణయాల్లో కూడా మంత్రులకు, అధికారులకు భాగస్వామ్యం ఉండేది కాదని చెబుతున్నారు. తన అభిప్రాయమే ఫైనల్ అన్నట్టు వ్యవహరించిన కేసీఆర్.. రెండో అభిప్రాయం వినేందుకు సిద్ధపడితే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
డబ్బుల స్కీమ్‌పై కేంద్రీకరణ
డబ్బులు వెదజల్లితే ప్రజలు ఓట్లు వేస్తారన్నతీరుగా బీఆరెస్ నేతలు వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే ఒక్కో ఎన్నికకు నేరుగా డబ్బులు పంపిణీ చేసే స్కీమ్‌లు తీసుకొచ్చారని గుర్తు చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్‌లో ఓడించడం కోసమే దళిత బంధు పథకం పుట్టుకొచ్చిందని చెబుతున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీ బంధు సహా వివిధ రకాల ‘బంధు’ల సంప్రదాయానికి తెర తీశారని, పోలింగ్‌కు ముందుగా రైతుబంధు నగదును బ్యాంకుల్లో జమ చేయడానికి ప్రయత్నించారని, రైతు రుణమాఫీని కూడా ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. వీటన్నింటి ద్వారా ఎన్నికలకు ముందు ఓటర్ల చేతికి అధికారికంగా సొమ్ములు చేరితే ఓట్లన్నీ తనవేనన్న అత్యాశ కొంప ముంచిందని స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటికీ కేసీఆర్ వ్యవహార శైలి తప్ప మరోటి కారణం కాదని అంటున్నారు.
ఏదీ ఆత్మగౌరవం?
తెలంగాణలో ఆత్మగౌరవానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. చిన్నచిన్న విషయాల్లో సైతం అది తరచూ బయటపడుతూనే ఉంటుంది. అలాంటిది ఈ పదేళ్లలో ప్రజలకు ఆత్మగౌరవం అనేది లేకుండా పోయిందని, డబ్బులిస్తే ఓట్లేసేవారిగానే బీఆరెస్ నేతలు చూశారని విమర్శలు ఉన్నాయి. అందుకే పథకాలు ఎన్ని ఇచ్చినా, డబ్బులు పంచినా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం, స్వేచ్ఛ కావాలని నినదించి.. ప్రభుత్వాన్ని మార్చారని మలి దశ తెలంగాణ ఉద్యమంలో మొదట కేసీఆర్ వెన్నంటి ఉండి, ఆ తరువాత దూరంగా ఉన్న గాదె ఇన్నయ్య అన్నారు. కాంగ్రెస్‌పై ప్రేమ కంటే కేసీఆర్‌పై కోపంతోనే ఓడించారని స్పష్టం చేశారు.
పైగా కేసీఆర్ తెలంగాణ ఆత్మను వదిలేశారన్నారు. ఆయన టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారని, అందుకే ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రజలు భారీ మెజార్టీతో ఓడించారంటున్నారు. హైదరాబాద్‌లో వచ్చిన మెజార్టీని, మెజార్టీ సీట్లను చూపుతూ రాష్ట్రవ్యాప్తంగా బీఆరెస్‌కు ఆదరణ తగ్గలేదని చెప్పుకోవడం వాస్తవాలను గుర్తించడానికి నిరాకరించడమేనని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఇకనైనా అధినేత తన ధోరణిని మార్చుకుంటే ప్రజల మనసు గెలుచుకోవడం కష్టమేమీ కాదని స్పష్టం చేస్తున్నారు.
శాతాల్లో తేడాను తగ్గించిన హైదరాబాద్ ఓట్లు
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి 92,35,792 ఓట్లు వచ్చాయి. ఇది 39.40 శాతంగా నమోదైంది. ప్రతిపక్ష బీఆరెస్‌కు 87,53,924 ఓట్ల పోలయ్యాయి. అంటే 37.35 శాతం. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్‌కు 4,81,868 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చినట్లు కనిపిస్తోంది. 2.05 శాతం ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ గెలిచిందని, ఇది పెద్ద గెలుపు కాదని బీఆరెస్ నేతలు సిద్ధాంతాలు సృష్టించారు కూడా. పైగా బీఆరెస్ 39 సీట్లలో గెలిచిందని, మరో 30 స్థానాల్లో సిట్టింగ్‌లను మారిస్తే మూడోసారి అధికారంలోకి వచ్చే వాళ్లమని చెప్పుకొంటున్నారు. నిజానికి అసలు విషయాలను పక్కనపెట్టి ఎమ్మెల్యే అభ్యర్థులపై నిందమోపడానికే బీఆరెస్ నాయకత్వం ఇప్పటికీ ప్రయత్నిస్తుండటం విచిత్రంగా ఉన్నదని ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు చెప్పారు.
నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా బీఆరెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నదనే విషయం పోలింగ్ శాతాలను నిశితంగా గమనిస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ రీజియన్‌లోని 25 సీట్లు మినహాయిస్తే ఉత్తర, దక్షిణ తెలంగాణలలో కాంగ్రెస్, బీఆరెస్‌కు మధ్య పోలైన ఓట్లతో భారీ తేడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ కలిపి కాంగ్రెస్‌కు 83,10,792 ఓట్లు వచ్చాయి. బీఆరెస్‌కు 71,76,924 ఓట్లు లభించాయి. అంటే ఈ రెండు రీజియన్లలో బీఆరెస్‌కంటే కాంగ్రెస్‌కు 11,33,868 ఓట్లు అధికంగా పోలయ్యాయి.
రీజియన్ల వారిగా ఓట్ల శాతం ఇలా..
బీఆరెస్ 25 సీట్లున్న ఒక్క హైదరాబాద్‌లో రీజియన్‌లోనే అత్యధిక స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమైంది. ఇక్కడ బీజేపీ ఒక్క స్థానం ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపొందాయి. హైదరాబాద్ రీజియన్‌లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 25.53 శాతం మాత్రమే. బీఆరెస్‌కు వచ్చిన ఓట్లు 38.97 శాతం. బీఆరెస్ కంటే కాంగ్రెస్‌కు 13.24 శాతం ఓట్లు తక్కువ వచ్చాయి. అయితే 51 సీట్లున్న ఉత్తర తెలంగాణ రీజియన్‌లో కాంగ్రెస్‌కు 33 సీట్లతో 41.26 శాతం ఓట్లు వచ్చాయి. బీఆరెస్‌కు 10 సీట్లతో 34.64 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 7 సీట్లతో 15.66 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రీజియన్‌లో బీఆరెస్ కంటే కాంగ్రెస్‌కు 6.62 శాతం ఓట్లు వచ్చాయి.
43 సీట్లున్న దక్షిణ తెలంగాణలో 30 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌కు 45.86 శాతం ఓట్లు రాగా 13 సీట్లు సంపాదించుకున్న బీఆరెస్‌కు 39.29 శాతం ఓట్లు లభించాయి. తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని ప్రకటించుకున్న బీజేపీకి ఈ రీజియన్‌లో ఒక్క సీటు కూడా రాలేదు కానీ 7.69 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీఆరెస్ కంటే కాంగ్రెస్‌కు 6.57 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. కేసీఆర్‌పై వ్యతిరేకత లేనట్టయితే ఇంత తేడా ఎందుకు వచ్చిందని పలువురు రాజకీయ విళ్లేషకులు అంటున్నారు. వాస్తవంగా హైదరాబాద్‌లో కూడా వ్యతిరేకత ఉన్నప్పటికీ పలు కారణాలు దానిని కవర్ చేశాయని చెబుతున్నారు. ఆంధ్రా సెటిలర్ల ఓట్లతో బీఆరెస్ గెలిచిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఆంధ్రా సెటిలర్ల తీరు చంద్రబాబు అరెస్టుకు ముందు ఒక లెక్క, విడుదల తరువాత మరో లెక్క అన్న తీరుగా ఉందని అంటున్నారు.
కేసీఆర్‌తో రాజకీయ అవసరాలు వచ్చే అవకాశం ఉన్నందున బీఆరెస్‌కు ఈసారి ఓట్లు వేయాలని ఆంధ్రా సెటిలర్లు తీసుకున్న నిర్ణయం వల్లనే హైదరాబాద్ రీజియన్‌లో మెజార్టీ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. దీనికితోడు తెలంగాణలోని వేర్వేరు జిల్లాల నుంచి ఉపాధి కోసం అనేక మంది హైదరాబాద్‌కు వచ్చి ఉంటున్నారు. వీరికి ఊళ్లలోనూ ఓటు హక్కు ఉంటుందని, కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఊళ్లకు వెళ్లి అక్కడ తమ వ్యతిరేకతను చాటారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.