విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేందుకే బడ్జెట్లో నిధులు తగ్గింపు
విధాత, వరంగల్ ప్రతినిధి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించి అరకోర కేటాయింపులు కేటాయించాయని ఎఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు నద్దునూరి అశోక్ స్టాలిన్ విమర్శించారు. విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెపేందుకే బడ్జెట్లో నిధులు తగ్గింపని, కేంద్ర బడ్జెట్ మొత్తం రూ.48,20,512 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్లో విద్యారంగం వాటా రూ.1,25,638 లక్షల కోట్లు మాత్రమేనని ఆవేదన వ్యక్తంచేశారు. గత సంవత్సరం 2.67 % కాగా అది ఈ బడ్జెట్లో 2.6%కి తగ్గిందని, రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.2,91,159 కోట్ల మొత్తం బడ్జెట్లో విద్యారంగం వాటా రూ.21,292 కోట్లు, 7.3% మాత్రమేనని అన్నారు.
గురువారం హనుమకొండలో ఎఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా స్టాలిన్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో కనీసం10 శాతం, రాష్ట్ర బడ్జెట్ లో కనీసం 30 శాతం విద్యారంగానికి కేటాయించాలని అనేక నివేదికలు చెబుతున్నా బడ్జెట్లో విద్యారంగం వాటా ఏ ఏటికాయేడు కుంచించుకుపోతూ కేంద్ర బడ్జెట్ లో 2.6%కు, రాష్ట్ర బడ్జెట్ లో 7.3%కు తగ్గడం కేంద్రానికి, రాష్ట్రానికి విద్యారంగం పట్ల ఉన్న వివక్షకు అద్దం పడుతుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో పాఠశాల విద్యకు రూ.71,508.93 కోట్లు కేటాయించగా, ఉన్నత విద్యారంగానికి రూ.53,196.28 కోట్లు కేటాయించారని, రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి రూ.21,292 మాత్రమే కేటాయించారని అన్నారు.
తెలంగాణలో జిల్లాకో నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు, కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు ప్రకటన లేదని ఏపీ కి విభజన హామీ చట్టాల అమలు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కేంద్రం తెలంగాణ పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. తెలంగాణ నుండి 8 మంది బిజెపి ఎంపీ లల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు, 6 మంది ఎంపీలు ఉండి ఏం లాభమని, కేంద్రం తెలంగాణకి అన్యాయం చేయడమంటే రాష్ట్ర బీజేపీ ఎంపీల చేతగాని తనమని వెంటనే వారు ఎంపీ, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని, అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించిన నిధులు ఏ మాత్రం సరిపోవని, కాంగ్రెస్ మేనిఫెస్టో లో 15% నిధులు కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు 7.3% కేటాయించిందని, ఇదివరకే రాష్ట్రంలో 8 వేయిలకు పైగా పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజ్ రియాంబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్ ,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్, కుక్కల కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి కసరబోయిన రవితేజ, ధర్మసాగర్ మండల కార్యదర్శి సిపతి వినయ్, జిల్లా సమితి సభ్యులు కుంటి పవన్, మోరపాక రాజు, మాలోత్ రాజు నాయక్, దేవరాజుల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.