- తెలంగాణపై కేంద్రం వివక్ష
- ఐదేళ్లలో ఇచ్చింది 1.42 లక్షల కోట్లే
- ఏపీకి ఇచ్చిన దాంట్లో సగమూ ఇవ్వలే
- బీహార్, యూపీలతో పోలికే లేదు
- కొత్త రాష్ట్రానికి బీజేపీ తీరని నష్టం
- కాగ్ నివేదికలలో బయటపడ్డ వాస్తవాలు
విధాత: తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతున్నదని రాష్ట్రాలవారీగా ఐదు సంవత్సరాల కాలానికి సంబంధించిన కాగ్ నివేదికలను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సంస్థల విషయంలో కూడా సవతి తల్లి ప్రేమనే చూపించింది. తెలంగాణ గిరిజన యువతీ, యువకుల కోసం ఏర్పాటు చేసిన గిరిజన యూనివర్సిటీ విషయంలో జరుగుతున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది. చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు గిరిజన యూనివర్సిటీలను కేంద్రం నిధులు ఇచ్చి ఏర్పాటు చేయించాలి. కానీ, ఏపీలో గిరిజన యూనివర్సిటీని దాదాపు రూ.840 కోట్లతో ఏర్పాటు చేసింది. వీసీ నియామకం కూడా పూర్తయి.. మూడేళ్లుగా తరగతులు నడుస్తున్నాయి. కానీ.. తెలంగాణ గిరిజన యూనివర్సిటీకి నిధులు విడుదల చేయలేదు. వీసీని నియమించలేదు. రాష్ట్రం పట్టుపట్టగా ఈ ఏడాది తరగతుల నిర్వహణకు అనుమతులు ఇచ్చారు కానీ భవన నిర్మాణానికి నిధులేవి? సిబ్బంది, వీసీల నియామకం ఏది? ఇలా ఒక్కటి రెండు అంశాలే కాదు.. కేంద్రం పన్నుల్లో వాటాగా ఇచ్చే నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను పరిశీలిస్తే తెలంగాణపై బీజేపీ సర్కారు పెద్దలకు ఉన్న వివక్ష స్పష్టం అవుతోంది.
కావాలనే నిధులివ్వడం లేదా?
బీజేపీ అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పు పట్టారు. తల్లిని చంపి బిడ్డను బతికించినట్లుగా ఉందని మోదీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. తెలంగాణ ఏర్పాటును తప్పు పట్టిన మోదీ కావాలనే తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. 2018 నుంచి ఐదేళ్ల కాలంలో పన్నుల్లో వాటాగా కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్గా కానీ ఇచ్చిన నిధులను పరిశీలిస్తే తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో అత్యంత తక్కువగా తెలంగాణకు రూ.1,42,694 కోట్ల నిధులు ఇవ్వగా, ఏపీకి రూ.3,07,676 కోట్లు, బీహార్కు రూ.5,24,749 కోట్లు ఉత్తరప్రదేశ్కు రూ.9,47,922.72 కోట్ల నిధులు విడుదల చేసింది. మరోవైపు బీజేపీ నేతలు 10 ఏళ్లలో రూ.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చినట్లుగా చెపుతున్నారు. అయితే.. ఐదేళ్లలో లక్షన్నర కోట్లు కూడా నిండుగా ఇవ్వని కేంద్రం ఏ విధంగా రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని చెబుతారని ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పన్నుల్లో వాటా జనాభా ప్రాతిపదికన ఇస్తారని చెపుతున్నారు. అలాంటప్పుడు పన్నుల్లో వాటా నిధులు ఏపీకి 55 శాతం వెళితే తెలంగాణకు 45 శాతం నిధులు ఇవ్వాలి. కానీ సగం నిధులు కూడా ఇవ్వలేదు. పన్నుల్లో వాటా కింద కేంద్రం తెలంగాణకు ఐదేళ్లలో కేవలం రూ.85,649 కోట్లు ఇవ్వగా, ఏపీకి 1,59,053 కోట్లు, బీహార్కు 3,83,733 కోట్లు, ఉత్తరప్రదేశ్కు 6,91,375.12 కోట్లు ఇచ్చింది. తెలంగాణకు ఐదేళ్లలో లక్ష కోట్లు కూడా ఇవ్వలేదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పరిస్థితి మరీ ఘోరం. ఏపీకి ఇచ్చిన దాంట్లో మూడవ వంతు మాత్రమే నిధులు ఇచ్చి తెలంగాణ పట్ల బీజేపీ సర్కారుకు ఉన్న ప్రేమ ఎలాంటిదో చూపించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ తెలంగాణకు రూ.57,045 కోట్లు, ఏపీకి రూ.1,48,523 కోట్లు, బీహార్కు రూ.1,41,016, యుపీకి రూ.2,56,547.60 ఇచ్చి తన ప్రేమ ఎవరిపై ఎంత ఉందో బీజేపీ సర్కారు స్పష్టం చేసింది.
రూపాయికి వచ్చేది 43 పైసలే
తెలంగాణ నుంచి భారీ వచ్చిన ఆదాయాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లిన బీజేపీ సర్కారు ఒక్క రూపాయకు తిరిగి 43 పైసలు మాత్రమే తిరిగి రాష్ట్రానికి ఇస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవమేనని కాగ్ లెక్కలను పేర్కొంటున్నాయి. అదే బీహార్ నుంచి పన్నుల రూపంలో రూపాయి తీసుకు వెళితే తిరిగి రూ.7.50 ఇస్తున్నదని ఆర్థిక నిపుణలు చెపుతున్నారు. రాష్ట్రాలవారీగా సొంత పన్నుల ఆదాయాన్ని పరిశీలిస్తే తెలంగాణలో భారీ ఎత్తున ఆదాయం వస్తుందని అర్థం అవుతోంది. అదే బీహార్ను పరిశీలిస్తే ఆదాయం అక్కడ ఎలా ఉందో ఇట్టే తెలిసి పోతుంది. చిన్న రాష్ట్రమైనప్పటికీ ఐదేళ్లలో తెలంగాణ సొంత పన్నుల ఆదాయం రూ.3,97,141 కోట్లుగా కాగా బీహార్ ఆదాయం రూ.1,68,780 కోట్లు మాత్రమే. తెలంగాణకు సొంత పన్నుల ఆదాయం ఏపీ కంటే కూడా అధికంగానే ఉన్నది. ఏపీ సొంత పన్నుల ఆదాయం రూ. 3,22,045 కోట్లు మాత్రమే. అయితే వివిధ ప్రాజెక్ట్ల విషయంలో కానీ, నిధుల కేటాయింపుల విషయంలో కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై నిరంతరాయంగా వివక్షనే చూపిస్తోందని లెక్కలు తెలియజేస్తున్నాయి. మరో వైపు విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణకు ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవ్వడం లేదు. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించడంతోపాటు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిగా కేంద్ర నిధులతోనే నిర్మిస్తామని ప్రకటించిన బీజేపీ కేంద్ర సర్కారు తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ను రద్దు చేసింది. కాచిగూడ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసే లేదు.
గిరిజన యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం 335.04 ఎకరాల భూమిని కేటాయించి ఇచ్చినప్పటికీ నిధులు విడుదల చేయలేదు. ఏడు ఏళ్లలో రెండు దఫాలుగా రూ.889.07 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిన కేంద్రం ఆ నిధులు మొదటి ఫేస్ ఇవ్వకుండా నాన్చుతున్నది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని, ఈ మేరకు నిధులు విడుదల చేయాలని, ప్రిన్సిపల్ను నియమించాలని కేంద్రాన్ని కోరింది. అయినా తెలంగాణపై వివక్ష చూపిస్తున్న కేంద్రం తెలంగాణ గిరిజన యువతీ యువకులకు ప్రత్యేక యూనివర్సీటీ లేకుండా చేస్తున్నది. అదే ఏపీకి మాత్రం 2019 లోనే గిరిజన యూనివర్సిటీకి రూ. 420 కోట్లు మొదటి విడతగా విడుదల చేసింది. యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ ను నియమించింది. తరగతులు కూడా మూడేళ్లుగా జరుగుతున్నాయి. భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇలా తెలంగాణ పట్ల కేంద్రం మొదటి నుంచి సవతి తల్లి ప్రేమనే చూపిస్తోంది. నిధుల విడుదల విషయంలో వివక్షత పూరితంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ నుంచి పన్నుల రూపేణా వసూలవుతున్న ఆదాయాన్ని లక్షల కోట్లలో తీసుకు వెళుతున్న కేంద్రం ఏదో నామ మాత్రంగానే పన్నుల్లో వాటా నిధులు విడుదల చేస్తోందని రాష్ర్ట ప్రభుత్వం విమర్శిస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూనే కేంద్రం తెలంగాణపై చూపిన వివక్షకు నిరసనగా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు.