హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విధాత):
Telangana Highest Debts CAG Report | తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వంతో పాటు కార్పొరేషన్ల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకుని రాష్ట్రం కోలుకోని విధంగా దిగజార్చారనే విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలను నిజం చేస్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా నివేదిక విడుదల చేసింది. తెలంగాణలో మార్చి 2023 నాటికి స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో తీసుకున్న అప్పుల శాతాన్ని కాగ్ వెల్లడించింది. మొత్తం జీఎస్డీపీలో తెలంగాణ ప్రభుత్వం అప్పులు 15.03 శాతం ఉండగా, సిక్కిం (11.21%) రెండో స్థానంలో, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (10.61%) మూడో స్థానంలో ఉండటం విశేషం. రుణాల గ్యారెంటీలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటులో దేశంలోనే తొలి స్థానంలో ఉంది. ఏపీలో రెవెన్యూ లోటు 3.30 శాతం ఉండగా ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం కావడంతో కేంద్ర ప్రభుత్వం దయతలిచింది. రెవెన్యూ లోటు పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేసింది.
రుణాల గ్యారెంటీలో దేశంలోనే టాప్ తెలంగాణ
2023 మార్చి 31వ తేదీ నాటికి దేశంలోని అన్ని రాష్ఠ్ర ప్రభుత్వాలు తమ స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో 3.91 శాతం అనగా రూ.10 లక్షల 14 వేల 319 కోట్ల కు వివిధ ఆర్థిక సంస్థలకు గ్యారెంటీలు ఇచ్చాయి. ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గ్యారెంటీలు ఇచ్చిన వాటిలో ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ఉన్నాయి. మొత్తం జీఎస్డీపీలో తెలంగాణ ప్రభుత్వం అప్పులు 15.03% ఉండగా, సిక్కిం (11.21%) రెండో స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (10.61 శాతం) ఉంది. చివరగా ఉత్తరాఖండ్ (0.04 శాతం), అరుణాచల్ ప్రదేశ్ (0.04 శాతం) గ్యారెంటీలు ఇచ్చాయి. తమ జీఎస్డీపీలో 0.50 శాతం లోపే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం, మిజోరం, గోవా రాష్ట్రాలు గ్యారెంటీలు ఇచ్చాయి.
రెవెన్యూ లోటులో ఏపీ నంబర్ వన్
దేశంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలు రెవెన్యూ మిగులులో ఉండగా, 5 రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నాయి. ఆరు రాష్ట్రాలలో జీరో రెవెన్యూ ఉంది. 17 రాష్ట్రాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్ రాష్ట్రాలు రెవెన్యూ లక్ష్యం సాధించి లోటు నుంచి బయటపడగా, మిగతా 12 రాష్ట్రాలు మిగులు బడ్జెట్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (3.30 శాతం), హర్యానా (0.98%), కర్ణాటక (0.78%), మహారాష్ట్ర (1.42%), పంజాబ్ (1.99%) రెవెన్యూ లోటులో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి దయనీయంగా ఉంది. రెవెన్యూ లోటును పూడ్చేందుకు ఆర్థిక కమిషన్ ఆంధ్రప్రదేశ్ తో పాటు అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు గ్రాంట్లు మంజూరు చేసింది.
వేతనాలు అలెవెన్సులకు ఎక్కువ కేటాయిస్తున్న చిన్న రాష్ట్రాలు
తమ వార్షిక బడ్జెట్‌లో చిన్న రాష్ట్రాలు ఉద్యోగుల వేతనాలు, అలవెన్సుల కోసం ఎక్కువ వెచ్చిస్తుండగా, పెద్ద రాష్ట్రాలు తక్కువ వ్యయం చేస్తున్నాయి. జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా తక్కువ ఉన్న నాగాలాండ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ 2022–23లో 37.91% ఖర్చు చేయగా, అతి స్వల్పంగా గుజరాత్ ప్రభుత్వం 6.25 శాతమే చెల్లించింది. నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ, అస్సాం, పంజాబ్, మేఘాలయ, హర్యానా, గోవా వంటి రాష్ట్రాలు 20 శాతానికి పైగా చెల్లించాయి. గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతంలోపే ఉండటం విశేషం. ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ల కోసం రాష్ట్ర బడ్జెట్ 2022–23లో అత్యధికంగా చెల్లించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ (18.36%) కాగా స్వల్పంగా చెల్లించిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ (6.52%). హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, కేరళ, మణిపూర్, మిజోరం రాష్ట్రాలు 15 శాతం, అంతకన్నా మించి చెల్లింపులు జరిపాయి. పంజాబ్, అస్సాం, ఉత్తరాఖండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, గోవా, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు 10 నుంచి 15 శాతం లోపు చెల్లించాయి.
రుణాలకు వడ్డీలు చెల్లింపులు
రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రుణాలపై క్రమం తప్పకుండా వడ్డీలు బ్యాంకులు నిర్ధేశించిన ప్రకారం చెల్లిస్తుంటాయి. రాష్ట్ర బడ్జెట్ 2022-23లో హర్యానా ప్రభుత్వం అత్యధికంగా 16.67% చెల్లించగా, అరుణాచల్ ప్రదేశ్ 3.27% చెల్లింపులు చేసింది. హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు 10 శాతానికి మించి చెల్లించగా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మిజోరం, మణిపూర్ రాష్ట్రాలు మాత్రం 5 శాతం లోపే వడ్డీలు చెల్లించడం గమనార్హం.
సబ్సిడీల్లో టాప్ పంజాబ్
2022–23 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం (16.93 శాతం) సబ్సిడీల విడుదల చేయడంలో ప్రథమ స్థానంలో ఉండగా చివరి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ (0.00) ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ఒక్క పథకానికి కూడా నయాపైస సబ్సిడీ విడుదల చేయలేదనేది స్పష్టమవుతున్నది. పంజాబ్ తో పాటు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, 10 శాతానికి మించగా, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, ఉత్తరాఖండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, కేరళ, అస్సాం, గోవా రాష్ట్రాలు 2 శాతం లోపే సబ్సిడీలు ఇచ్చాయి.
భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రథమం అరుణాచల్ ప్రదేశ్
రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2022-23లో భారీ ప్రాజెక్టులు, భూ సేకరణ వంటి పబ్లిక్ వర్క్స్ కోసం అరుణాచల్ ప్రదేశ్ 31.67 శాతం నిధులు ఖర్చు చేయగా, కేరళ అతి తక్కువగా 1.18 శాతం నిధులు మాత్రమే వ్యయం చేసింది. కర్ణాటక రాష్ట్రం కూడా 2.01 శాతానికి మించి ఖర్చు పెట్టలేదు. మణిపూర్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు 10 శాతానికి మించి వెచ్చించాయి.
ఇవీ రాష్ట్ర ప్రభుత్వాల ఇన్వెస్టిమెంట్లు, డిపాజిట్లు
రాష్ట్ర ప్రభుత్వాలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయంలో రూ.90,471 కోట్లు షేర్లు, ఈక్వీటీలు, సెక్యూరిటీలు, ఫిక్స్‌డ్ టెర్మ్ డిపాజిట్ల రూపంలో పెట్టుబడులు పెట్టాయి. ఈ మొత్తంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రూ.45,379 కోట్లు, మహారాష్ట్ర రూ.18,067 కోట్లు, గుజరాత్ ప్రభుత్వం రూ.7,891 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలు ఒక్క పైసా డిపాజిట్లు తీసుకోలేదు. అస్సాం (0.09 శాతం) రాష్ట్రంతో సమానంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం విశేషం.
ఇవి కూడా చదవండి..
Land Grabbers Rampalli Village | ఎన్ఆర్ఐ మహిళకు చెందిన భూమి.. దర్జాగా కబ్జా! మంత్రి అండతోనే?
హామీలు అమలు చేయని రేవంత్ : బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది
