విధాత ప్రత్యేక ప్రతినిధి: మేడారం సమ్మక్క సారలమ్మ సాక్షిగా రైతులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలుచేయలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పిన మేడారంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. అనేక ప్రమాణాలు చేసి అమలు చేయలేదన్నారు. వరంగల్ జిల్లాలో రూ. 275 కోట్ల పంట బోనస్ పెండింగ్ లో ఉందన్నారు. రైతులకు రుణ మాఫీ 46 శాతం మించలేదని ఆరోపించారు. హన్మకొండలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసం అయ్యిందని విమర్శించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే దమ్ము కాంగ్రెస్ కు లేదని అన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు. బతుకమ్మ సందర్భంగా మంత్రులు బతుకమ్మను అవమానపరిచారని, ఆరు గ్యారెంటీలు, రేవంత్ రెడ్డి పాటలు వేసి బతుకమ్మ స్ఫూర్తిని ఆడబిడ్డల సాక్షిగా అవమానపరిచారన్నారు. సకాలంలో యూరియా అందించక పోవడంతో పంటలు ఎర్రబారి, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. వరంగల్ మార్కెట్ లో మొక్కజొన్న కొనే దిక్కు లేదన్నారు. తమ ప్రభుత్వం దేవాదుల ఫేజ్ 3లో భాగంగా రామప్పను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేశారని, రామప్ప – లక్నవరం నుంచి జంపన్న వాగుకు గోదావరి నీళ్లు ఇచ్చేలా ప్రణాళిక చేశారని, ఈ ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి రివ్యూ చేసి స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. గోదావరి జలాలను జంపన్న వాగు ద్వారా మేడారం జాతర సందర్భంగాఅందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, కుసుమ లక్ష్మీనారాయణ, భరత్ కుమార్ రెడ్డి, తాళ్లపెల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, సల్వాజీ రవీందర్ రావు, రెంటాల కేశవ రెడ్డి, శరత్ చంద్ర, సారయ్య, పెరికారి శ్రీధర్ రావు, విజయ్ రెడ్డి, శ్రీకాంత్ చారి, చాగంటి రమేష్, గౌస్ , దేవమ్మ, సారిక తదితరులు పాల్గొన్నారు.