– నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ గట్టేక్కెనా?
– కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ
– ఇప్పటి వరకు ప్రచారం వైపు దృష్టి పెట్టని నేతలు
– కాంగ్రెస్ దారిలోనే బీఆర్ఎస్ నేతలు
– సిటింగ్ బీఆర్ఎస్ ఎంపీకి మళ్ళీ అవకాశం వచ్చేనా
– కొత్త నేత కోసం ప్రయత్నం చేస్తున్నదనే సమాచారం
– అభ్యర్థి కోసం బీజేపీ నేతల అన్వేషణ
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: నాగర్ కర్నూల్ (కందనూలు) పార్లమెంట్ స్థానంలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ జనరల్ కు కేటాయించగా, నాగర్ కర్నూల్ స్థానం ఎస్సీలకు రిజర్వు చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ నేత వంశీచంద్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ స్థానంలో మాత్రం ఆపార్టీ నేతల మధ్య టికెట్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంలో ప్రచారంలో నేతలెవ్వరూ పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ రంగంలో ఉన్నారు. ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన సంపత్ కుమార్ ఈ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలనే ఉద్దేశంతో మల్లు రవి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు తనవంతు సహకారం అందించారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, వనపర్తి, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో ఎంపీ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తే ఈ స్థానంలో సులువుగా విజయం సాధించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకున్న మల్లు రవి, సంపత్ కుమార్ ఈ స్థానంలో పోటీ చేసేందుకు ఉబలాట పడుతున్నారన్న ఆపార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మల్లు రవికి ఈ మధ్య ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దీంతో ఆయన ఎంపీ స్థానంలో పోటీ చేయరనే వార్తలు కూడా వచ్చాయి. ఇక సంపత్ కుమార్ కు లైన్ క్లియర్ అయిందనే భావనలో ఆయన ఆనందలో ఉన్నారు. రెండు రోజుల క్రితం మల్లు రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తనకు ఇచ్చిన పదవికి, ఎంపీ స్థానంలో పోటీ చేయడానికి ఎలాంటి సంబంధం లేదని, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో తానే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటానని ప్రకటించారు. దీంతో సంపత్ కుమార్ మళ్ళీ డైలమాలో పడ్డారు. ఇద్దరి మధ్య టికెట్ పోటీలో ఎన్నికల ప్రచారం చేయడంలో వెనుకంజలో ఉన్నారు. నువ్వా నేనా అన్నట్లు ప్రచారానికి ఇద్దరూ దూరంగా ఉన్నారు. దీంతో ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్ అయోమాయంలో ఉన్నారు.
– సిటింగ్ ను మార్చే యోచనలో బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చూపాలని చూస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సమావేశంలో పార్లమెంట్ స్థానాలపై నేతలు దృష్టి పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును పార్లమెంట్ ఎన్నికల్లో రాబట్టుకోవాలనే సంకేతలు పార్టీ క్యాడర్ కు ఇస్తున్నారు. పాలమూరులో రెండు పార్లమెంట్ స్థానాలు గెలుపొందాలని మాజీ ఎమ్మెల్యేలకు అల్టిమేటం ఇచ్చారు. దీంతో గెలుపు గుర్రాల కోసం ఆ పార్టీ నేతలు వేట ప్రారంభించారు. రెండుచోట్ల సిటింగ్ లను మార్చాలని బీఆర్ఎస్ చూస్తోందని ప్రచారంలో ఉంది. కానీ పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆ పార్టీ అధిష్టానం ఆలోచన మారినట్లు తెలుస్తోంది. మళ్ళీ సిటింగ్ లపైనే దృష్టి పెట్టినట్లు సమాచారం. సిటింగ్ లు కూడా పోటీలో ఉండేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం తలలు పట్టుకొంటుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థిని మార్చకున్నా, నాగర్ కర్నూల్ లో మార్చడం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇక్కడి సిటింగ్ ఎంపీ పోతుగంటి రాములును మార్చే ఉద్దేశంలో బీఆర్ఎస్ ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడంలో రాములు ఘోరంగా విఫలం చెందారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఎంపీగా మళ్ళీ పోటీలో ఉంచేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. కొత్త అభ్యర్థి కోసం ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ సెగ్మెంట్ లో ఏడు నియోజకవర్గాల్లో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.
– అడ్రస్ లేని బీజేపీ
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీజేపీ అడ్రస్ లేకుండా ఉంది. ఆ పార్టీ నుంచి పోటీలో ఎవరు ఉంటారనే క్లారిటీ నేటికీ లేదు. గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన బంగారు శృతి పేరు పరిశీస్తున్నట్లు సమాచారం. ఈ సెగ్మెంట్ లో కల్వకుర్తి, గద్వాలలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ ఎంపీ అభ్యర్థిని గెలిపించే స్థాయి కనబడడం లేదు. ఎన్నికల వరకు బీజేపీ పుంజుకుoటుందనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఏదిఏమైనా మూడు పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరనే అభిప్రాయానికి ఆయా పార్టీల కార్యకర్తలు రాలేదు. రెండు స్థానాల్లో గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అధిష్టానాలు ఉన్నాయి.