మేడిగడ్డ ఘ‌ట‌న‌పై కేంద్రం సీరియస్.. ఆరుగురు నిపుణుల‌తో క‌మిటీ

  • Publish Date - October 23, 2023 / 09:09 AM IST

విధాత‌: కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా చేప‌ట్టిన మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగిన ఘ‌ట‌న‌పై కేంద్రం సీరియ‌స్ అయింది. ఈ ఘ‌ట‌నను తీవ్రంగా ప‌రిగ‌ణించిన కేంద్ర ప్ర‌భుత్వం.. నేష‌న‌ల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మ‌న్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు స‌భ్యుల‌తో నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేసింది.


ఈ క‌మిటీ హైద‌రాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ అధికారుల‌తో మేడిగ‌డ్డ‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌నుంది. స‌మీక్ష అనంత‌రం మేడిగ‌డ్డ బ్యారేజీని నిపుణుల క‌మిటీ సంద‌ర్శించ‌నుంది. బ్యారేజీని ప‌రిశీలించిన అనంత‌రం నిపుణుల క‌మిటీ కేంద్రానికి నివేదిక ఇవ్వాల‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది.


మేడిగ‌డ్డ బ్యారేజీ బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్ల‌ర్ల మ‌ధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయిన విష‌యం తెలిసిందే. 20వ పిల్ల‌ర్ కుంగిపోవ‌డంతోనే వంతెన కూడా కుంగిన‌ట్లు తెలుస్తోంది. 1.6 కిలోమీట‌ర్ల పొడ‌వున్న ఈ వంతెన.. కుంగిన ప్ర‌దేశం మ‌హారాష్ట్ర వైపు నుంచి 356 మీట‌ర్ల దూరంలో ఉంది.