Site icon vidhaatha

Chinna Reddy | ప్రజావాణిలో 5,23,940 దరఖాస్తులు.. 4,31,348 పరిష్కారం:  చిన్నారెడ్డి

విధాత, హైదరాబాద్ : ప్రజావాణి కార్యక్రమం పురోగతిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ సీఎంగా ఏ.రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే ప్రజావాణి కార్యక్రమం అమల్లోకి వచ్చిందని, 50 వారాలుగా (ఆగస్ట్ 6వ తేదీ నాటికి) ప్రజావాణిని ప్రభుత్వం నిరాటంకంగా నిర్వహించిందని తెలిపారు. ఇప్పటివరకు ప్రజావాణికి అందిన దరఖాస్తులు 5,23,940 కాగా, అందులో 4,31,348 దరఖాస్తులు పరిష్కంచబడ్డాయని, మిగిలినవి 92,592 దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయని తెలిపారు. కేవలం​ ప్రజాభవన్​లో నమోదైన అర్జీల సంఖ్య దాదాపు 60 వేలుగా ఉందన్నారు.

ఇప్పటివరకు ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో సగానికి పైగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగాలు ఇప్పించాలనే విజ్ఞప్తులు ఉన్నాయని, ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకు ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తు చేయని వారు కూడా ప్రజాభవన్‌కు వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, కోర్టుల పరిధిలో ఉన్న అంశాలు మినహా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అన్ని విభాగాలు అక్కడికక్కడే పరిశీలిస్తున్నాయని తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ప్రజావాణిలో రెవిన్యూ నుంచి తహసీల్దార్, డిప్యూటీ తహతీల్దార్, సీసీఎల్ఏ అధికారులు, పోలీస్ విభాగం నుచి సీఐ, డీఐజీ, డీసీపీ ర్యాంకు అధికారులు, హెల్త్ తో పాటు అన్ని సంక్షేమ విభాగాల నుంచి అడిషనల్ డైరెక్టర్ స్థాయి అదికారులు ప్రజావాణి డెస్క్ లలో అందుబాటులో ఉంటారన్నారు.

ఆరోగ్య శ్రీ జనరల్ మేనేజర్ అధ్వర్యంలో ఆరోగ్య శ్రీ డెస్క్ ఉంటుందని, అత్యవసర సేవల నిమిత్తం మెడికల్ హెల్ప్ డెస్క్, అంబులెన్స్ సిద్ధంగా ఉంటుందని, మహిళా బాధితులకు తోడుగా ఉండేందుకు సఖి వాహనం, పిల్లలకు బాలారక్ష అంబులెన్స్‌ ఇక్కడే ఉంటాయని చెప్పారు. దివ్యాంగుల అర్జీల స్వీకరణకు ప్రత్యేకమైన డెస్క్ ఏర్పాటు చేశారని, వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను, వినతులను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలకు రూ.5 కే భోజనం ఇక్కడ అందుబాటులో ఉంటుందన్నారు. గతంలో ఒకే అర్జీదారుడు రెండు మూడు సార్లు వచ్చే వారని, . ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, అర్జీదారు మొబైల్ నెంబర్ నమోదు చేయగానే తన పిటిషన్ స్కాన్డ్ కాపీ అక్కడ ప్రత్యక్షమవుతుందన్నారు. దీంతో ఆ విజ్ఞప్తి ఏ స్థాయిలో ఉందో అర్జీదారులకు తెలియజేసి పంపిస్తున్నామని చెప్పారు. ప్రజావాణిలో అర్జీదారులు తమ పిటిషన్ల స్టేటస్‌ను కూడా వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే వీలుంటుందని, అందుకు వీలుగా సీజీజీ ద్వారా ప్రత్యేక పోర్టల్ ను ప్రభుత్వం డెవెలప్ చేయించిందని వెల్లడించారు.

ప్రజాభవన్ ప్రజావాణిలో 465దరఖాస్తులు

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 465 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 117, పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 45, విద్యుత్ శాఖ కు సంబంధించి 31, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 39, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించి 58, ఇతర శాఖలకు సంబంధించి 175 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version