డిండి ప్రాజెక్టు పూర్త‌యితే దేవ‌ర‌కొండ ద‌రిద్రం పోతుంది : సీఎం కేసీఆర్

  • Publish Date - October 31, 2023 / 12:58 PM IST

డిండి ప్రాజెక్టు పూర్త‌యితే దేవ‌ర‌కొండ నియోజ‌క‌వ‌ర్గం ద‌రిద్రం పోత‌ద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు పాల‌మూరు ఎత్తిపోత‌ల‌తో లింక్ ఉంట‌ది కాబ‌ట్టి రాబోయే కొద్ది రోజుల్లో నీళ్లు వ‌స్తాయ‌ని సీఎం తెలిపారు.


దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే ర‌వీంద‌ర్ నాయ‌క్ ఉద్య‌మాల నుంచి వ‌చ్చిన బిడ్డ అని కేసీఆర్ గుర్తు చేశారు. పార్టీలో చేరినప్ప‌టి నుంచి డిండి ప్రాజెక్టు కోసం, ఇక్క‌డి వ్య‌వ‌సాయం, నీళ్ల గురించే మాట్లాడేవారు. కాంగ్రెస్ పార్టీల నాయ‌కులే స్టేలు తీసుకురావ‌డంతో డిండి లిఫ్ట్ ఇరిగేష‌న్ ఆగింది. ఇప్పుడిప్పుడు కోర్టు చిక్కులు పోయాయి. కేంద్ర ప్ర‌భుత్వం 10 ఏండ్ల స‌మ‌యం తీసుకుని, మొన్న నేను చెడామ‌డా తిట్టిన త‌ర్వాత ఈ మ‌ధ్య‌నే దాన్ని ట్రిబ్యున‌ల్‌కు రిఫ‌ర్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో డిండి ప్రాజెక్టు పూర్త‌వుతుంది. పాల‌మూరు ఎత్తిపోత‌లకు లింక్ ఉంది కాబ‌ట్టి అది అయిపోయిందంటే.. ఐదు రిజ‌ర్వాయ‌ర్లు, ఒక బ్యార‌జ్ కూడా దేవ‌ర‌కొండ‌లో వ‌స్తుంది. మీ యొక్క ద‌రిద్రం పోతుంది అని కేసీఆర్ అన్నారు.


తెలంగాణ రాక ముందు ప‌రిస్థితి ఎలా ఉండే. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాల‌ని కోరుతున్నాను అని కేసీఆర్ సూచించారు. క‌రెంట్, మంచి నీళ్లు బాధ‌లు పోయిన‌య్, సాగునీటి బాధ‌లు తీర్చుకుంటున్నాం. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేసుకుంటున్నాం. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో ఒక్క తండాను గ్రామ‌పంచాయ‌తీ చేయ‌లేదు. మా తండాల్లో మా రాజ్యం అనే నినాదాన్ని నిజం చేసుకున్నాం. 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.


దేవ‌ర‌కొండ‌ వెనుక‌బ‌డిన ప్రాంతం కాబ‌ట్టి నాకు ప్ర‌త్యేక‌మైన దృష్టి ఉంద‌ని సీఎం పేర్కొన్నారు. చ‌క్క‌టి ఎమ్మెల్యే ఉన్నారు. ర‌వీంద‌ర్ నాయ‌క్ బాధ‌పెట్టే వ్య‌క్తి కాదు. చ‌క్క‌టి నాయ‌కుడు కాబ‌ట్టి డ‌బుల్ మెజార్టీతో గెలిపించాలి. దేవ‌ర‌కొండ చ‌రిత్ర‌లో ఇదే పెద్ద మీటింగ్ అని అనుకుంటున్నాం. ఇంత‌కుముందు వ‌చ్చిన కానీ ఇంత గొప్ప స‌మావేశం జ‌ర‌గ‌లేదు. ర‌వీంద‌ర్ కుమార్ 80 వేల మెజార్టీతో గెలిచిపోయిండు అని అర్థ‌మ‌వుతుంది.


మ‌ళ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత వ‌స్తాను. ఒక రోజుంతా దేవ‌ర‌కొండ‌లో ఉంటాను. ప్రాజెక్టుల‌ను ప‌రిశీలిస్తాను. ఇక్క‌డ కొన్ని ప‌రిశ్ర‌మ‌లు కూడా రావాల‌ని కోరారు. 100 శాతం మీతో పాటు ఉంటాను. వెనుక‌వ‌డ్డ ప్రాంతాల్లో పేద‌రికం పోవాలి. మంచి వ్య‌క్తిని గెలిపించుకుంటే మంచి జ‌రుగుతుంది. మ‌ళ్లీ మ‌న గ‌వ‌ర్న‌మెంటే వ‌స్తుంది. అందులో అనుమానం అవ‌స‌రం లేదు. మీ ఆశీర్వ‌చ‌నంతో ఈ రాష్ట్రాన్ని బ్ర‌హ్మాండంగా ముందుకు తీసుకుపోవాలి. అగ్రిక‌ల్చ‌ర్ పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొచ్చే బాధ్య‌త నాది.