విధాత: బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యలపై తక్షణమే సీఎం కేసీఆర్ స్పందించి న్యాయం చేయాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా పరిధిలోని బస్వాపురం ప్రాజెక్టు భూ నిర్వాసితులు 26రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ 50 లక్షల నుండి కోటి రూపాయలు పలుకుతున్న తమ భూములను 15లక్షల 60వేలు చెల్లిస్తామని చెప్పి 15.05లక్షలు మాత్రమే చెల్లిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ భూనిర్వాసితులకు ఇచ్చిన పరిహారం బస్వాపురం భూనిర్వాసితులకు ఎందుకు ఎవ్వరంటూ ప్రశ్నించారు.
బస్వాపురం నిర్వాసితులు తెలంగాణ బిడ్డలు కాదా వారికెందుకు పరిహారం చెల్లించరంటూ నిలదీశారు. బస్వాపూర్ ప్రాజెక్టు పేరుతో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ తుంగతుర్తి నుంచి ఇసుక లారీలతో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు గుట్టలు కొని భూ దందా చేస్తున్నారన్నారని, రైతుల భూముల విషయంలో మాత్రం న్యాయం చేయడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మంచి మనసుతో ఆలోచించి బస్వాపూర్ నిర్వాసితులకు 350 కోట్లు వెంటనే చెల్లించాలని, పెరిగిన నిర్మాణ వ్యయం మేరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకుంటే.. వాస్తు బాగాలేదని బాగున్న సెక్రటేరియట్ ని కూలాగొట్టి 600 కోట్లతో కొత్త సెక్రెటరీ నిర్మాణం చేపట్టి.. ఇప్పుడు 1600 కోట్లకు దాన్ని బడ్జెట్ పెంచారని, అదే రైతులకు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించమంటే కెసిఆర్ కు చేతులు ఎందుకు రావడం లేదంటూ విమర్శించారు.
విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకుందని, కేసీఆర్ కూతురు ఇక్కడా, ఢిల్లీలో వ్యాపారాలు చేస్తుందని, కొడుకు బెంగళూరు తిరుగుతున్నాడని భూ నిర్వాసితులు మాత్రం రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్‌ను రెండు లక్షల కోట్లకు తీసుకెళ్లారని, అయినా కేసీఆర్ ఫామ్ హౌస్‌కు తప్ప కొత్తగా ఒక ఎకరానికి నీళ్లు అందించలేకపోయారని విమర్శించారు. కమిషన్ లు వచ్చే సచివాలయం నిర్మాణం వంటి కాంట్రాక్టు పనులకు బడ్జెట్ పెంచుతున్న కేసీఆర్ .. రైతులకు నష్టపరిహారం చెల్లిస్తే కమిషన్లు రావన్న ఉద్దేశంతోనే పరిహారం చెల్లింపులో అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
2017 లో ప్రకటించిన అవార్డు కాలం చెల్లిపోయిందని అప్పుడు బాలలుగా ఉన్నవారు ఇప్పుడు 18 ఏళ్ల మేజర్ గా మారిపోయారని వారికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో తాను పానగల్ లో ఆ రకంగా పరిహారం ఇప్పించామన్నారు.
కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు యాదాద్రికి రాకపోకల రోడ్డు గురించి వాసాలమర్రి గ్రామస్తులను మభ్యపెట్టి దత్తత తీసుకొని గాలికి వదిలేసాడని విమర్శించారు. సమైక్యాంధ్రలోనైనా బెదిరించైనా పనులు చేపించుకున్నామని, తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వంతో ప్రజా సమస్యలపై కోట్లాడితే పోలీసులతో అణిచి వేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బస్వాపురం నిర్వాసితుల సమస్యలను మానవీయ కోణంలో ఆలోచించి వెంటనే కొత్త అవార్డును ప్రకటించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో న్యాయం చేయాలని కోరారు. నిర్వాసితుల సమస్యలపై జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు రెండు రోజుల్లో న్యాయం చేయాలని లేని పక్షంలో నిర్వాసితులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెంకట్ రెడ్డి ప్రకటించారు
ఆందోళనలో బస్వాపురం భూనిర్వాసితుల తోపాటు అఖిలపక్ష పార్టీల నాయకులు, సర్పంచ్ లతా రాజు, ఎంపిటిసి గడియ ఆంజనేయులు, ఉపసర్పంచ్ దర్శన్ రెడ్డి పాల్గొన్నారు.