విధాత, హైదరాబాద్ : వరదలతో నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి…జరిగిన నష్టాన్ని పరిశీలించి బాధితుల కష్టాలను తెలుసుకున్నారు. దెబ్బతిన్న రోడ్లను కాలనీలను, కుర్దులో వరదలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ వంతెనను పరిశీలించారు. వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. దెబ్బతిన్న వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలని అధికారులను ఆదేశించారు.
బుడిగిడ గ్రామంలో వరదల్లో పంట నష్టపోయిన రైతులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. పంట నష్టం, ఆస్తి నష్టం పై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. పొలాల్లో ఇసుక మేటలు వేశాయని రైతులు నా దృష్టికి తెచ్చారు. ఆ మేటలను తొలగించి, తిరిగి వ్యవసాయ యోగ్యంగా భూములను తయారు చేయించేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. వరద నష్టం అంచనాలను తయారు చేసి కేంద్రం సహాయాన్ని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తక్షణ సహాయ పంపిణీ చేపట్టిందన్నారు.
విభాగాల వారిగా నష్టంపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించామని..ఇప్పటికే కలెక్టర్లతో సమీక్షించి నష్టం అంచనాలు తీసుకున్నామన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పిందన్నారు. బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకొని వారి కష్టాలను తెలుసుకునేందుకు మళ్లీ వచ్చానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాఖలను సమన్వయం చేసుకుంటూ సహాయక పునర్ నిర్మాణ చర్యలు చేపట్టాలని, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వరదల్లో నష్టపోయిన బీడీ కార్మికులను, ఇతర పారిశ్రామిక కార్మికులను ఆదుకుంటామన్నారు. విద్యార్థులందరికీ వెంటనే పుస్తకాల అందివ్వాలని ఆదేశించామని.. నాకు కొడంగల్ ఎలాగో.. కామారెడ్డి కూడా అలాగేనని రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.