విధాత, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలోని ముంపు ప్రాంతాల్లో శాశ్వత చర్యలు చేపట్టాలని అందుకు ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మొంథా తుపాన్ ప్రభావంతో నీట మునిగిన నగరంలోని పలు ప్రాంతాలను సీపీఐ బృందం గురువారం సందర్శించింది. నగరంలోని హనుమకొండ బస్టాండ్, ములుగు రోడ్, హనుమాన్ నగర్, పలువేల్పుల, గోపాల్ పూర్, సమ్మయ్య నగర్, వరంగల్ లోని హంటర్ రోడ్ తదితర ప్రాంతాలను సీపీఐ నాయకులు సందర్శించి స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతీ ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలం అవుతున్న దని, లోతట్టు ప్రాంత కాలనీలతో సహా రోడ్లు అన్నీ నీట మునుగుతున్నాయని అన్నారు. ఈ సారి మొంథా తుపాన్ ప్రభావం కారణంగా అత్యంత భారీ వర్షాలు కురియడంతో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీస్ పూర్తిగా నీట మునిగి ప్రజలు ఇండ్లలో నుండి బయటికి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. గతంలో వరంగల్ ను రెండవ రాజధానిగా చేస్తామని ప్రగల్భాలు పలికిన పాలకులు నగరాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ప్రతీ ఏటా కాలనీలు నీట మునుగుతున్నా గత ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం కోసం నిధులను కేటాయించలేదని, దాంతో అదే పరిస్థితి ప్రతి ఏటా పునరావృతం అవుతున్నదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా ముంపు ప్రాంతాల శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని, అందుకు రూ. 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటి, హెరిటేజ్ సిటీగా ప్రకటించిన కేంద్రం ప్రకటనలకే పరిమితం అయింది తప్ప నిధుల కేటాయింపులో సవతి తల్లి ప్రేమను కనబరుస్తూ వస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు అశోక్ స్టాలిన్,మునిగాల బిక్షపతి, ఏదునూరి వెంకట్రాజం, బాషబోయిన సంతోష్, బత్తిని సదానందం, గుంటి రాజేందర్, అలువాల రాజు, జూకంటి పద్మ, పొనుగోటి రాములు, గోపాల్ చారి, పూజారి అమృతయ్య, రమ తదితరులు పాల్గొన్నారు.
CPI Srinivas Rao : వరగల్ ముంపు శాశ్వత పరిష్కారంకై వెయ్యి కోట్లు కేటాయించాలి
వరంగల్ ముంపు ప్రాంతాల శాశ్వత పరిష్కారానికి రూ.1000 కోట్లు కేటాయించాలని సీపీఐ నేత తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
