కొన్ని సార్లు ఓడినా మంచే జరుగుతుంది: సీఎం రేవంత్‌రెడ్డి

కొన్ని సార్లు ఓడినా మంచే జరుగుతుందని, అందుకు ఉదాహారణగా 2018 ఎన్నికల్లో తాను ఓడిపోవడం వల్ల 2019లో ఎంపీగా గెలిచానని, అలాగే ఎమ్మెల్యే ఎన్నికల్లో

  • Publish Date - April 16, 2024 / 09:14 PM IST

ఎమ్మెల్యే ఓడినందునే …ఎంపీగా గెలిచా
సీఎంగా మీ ముందున్నా
గల్ప్ కార్మిక సంఘాల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు యోచన

విధాత, హైదరాబాద్‌ : కొన్ని సార్లు ఓడినా మంచే జరుగుతుందని, అందుకు ఉదాహారణగా 2018 ఎన్నికల్లో తాను ఓడిపోవడం వల్ల 2019లో ఎంపీగా గెలిచానని, అలాగే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారని, కేంద్ర మంత్రి అయ్యే అవకాశముందని సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తాజ్ డెక్కన్ లో గల్ఫ్ కార్మిక సంఘాలతో సమావేశం అయిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తాను ఎంపీగా గెలిచి..పీసీసీ చీఫ్‌గా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీ ముందు ఉన్నానన్నారు. అలాగే అదృష్టం కలిసి వచ్చి జీవనన్న కూడా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని తాను బలంగా భావిస్తున్నానని రేవంత్‌రెడ్డి చెప్పారు. గల్ఫ్ కార్మికుల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం పరిధితో పాటు కేంద్ర ప్రభుత్వం పరిధిలో కూడా ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మాట్లాడేందుకు తాను ఉన్నానని, కేంద్ర ప్రభుత్వం తరపున మాట్లాడేందుకు జీవన్ రెడ్డిని పార్లమెంట్ కు పంపించాలని సూచించారు. గల్ఫ్ సమస్యలపై పార్లమెంట్ లో నిలబడి కొట్లాడేందుకు మీ ప్రతినిధిగా జీవన్‌రెడ్డిని గెలిపిస్తే కేంద్రమంత్రిగా కూడా సొంతంగా మనకు కావాల్సిన నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కుతుందన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువమంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని, ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. గల్ఫ్,ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డ్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ప్రజా భవన్ లో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఒక టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.

సెప్టెంబర్ 17లోగా గల్ఫ్ కార్మికుల సమస్యలకు పరిష్కార వ్యవస్థ
సెప్టెంబర్ 17 లోగా మీ సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత మాదని స్పష్టం చేశారు. ఫిలిప్పీన్ విధానాలను మేం స్పష్టంగా అధ్యయనం చేశామని, కార్మికుల హక్కులు కాపాడేందుకు ఆ దేశమే ఇతర దేశాల వ్యవస్థలతో మాట్లాడుతుందని, కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా అధ్యయనం చేశామన్నారు. ఇప్పటికే గల్ఫ్ కార్మికుల కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తామని, పాలసీ డాక్యుమెంట్ పై మీ అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ముందుకెళతాని వారికి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మికులకు న్యాయపరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు తీసుకోబోతున్నామని, ఏజెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గల్ఫ్ వెళ్లే వారికి ఒక వారం రోజులు శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తున్నామని, రైతు బీమాలాగే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Latest News