హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ‌కు వ‌చ్చారు. సోమ‌వారం సాయంత్రం బేగంపేట విమానాశ్రాయానికి చేరుకున్న రాష్ట్రప‌తి ముర్ముకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్

  • Publish Date - December 18, 2023 / 03:04 PM IST

విధాత‌: రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ‌కు వ‌చ్చారు. సోమ‌వారం సాయంత్రం బేగంపేట విమానాశ్రాయానికి చేరుకున్న రాష్ట్రప‌తి ముర్ముకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. అనంత‌రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు.

20న పోచంపల్లిని సందర్శించనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ముర్ము ఈ నెల 20న భూదాన్‌పోచంపల్లిలో ఉదయం 11.10గంటల నుంచి మధ్యాహ్నం 12.10గంటల వరకు పర్యటిస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన యాదాద్రి జిల్లా పోచంపల్లిలో జరిగే థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఇక్కడ చేనేత వస్త్రాల తయారీలో వివిధ అవార్డులు అందుకున్న చేనేత కార్మికులు, పద్మశ్రీ, సంత్‌కబీర్ తదితర జాతీయ అవార్డు గ్రహీతలు అవార్డులు పొందిన గజం గోవర్ధన్, గజం అంజయ్య, బాలయ్య, సంత్ కబీర్‎లతో ముఖాముఖి నిర్వహిస్తారు.

పోచంపల్లి హ్యాండ్లూమ్ సొసైటీతో పాటు ఇక్కడి షోరూంలను ఆమె సందర్శించనున్నారు. మగ్గాలు, మగ్గం నేసే ప్రక్రియ పరిశీలిస్తారు. స్థానిక చేనేత కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తెలంగాణ హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఔనత్యాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శనను అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ చేనేత వస్త్రాలు గొల్లభామ, పోచంపల్లి, ఇక్కత్‌ వస్త్రాలు, నారాయణపేట, గద్వాల వస్త్రాలు, పుట్టపాక తెలియా రుమాలును ప్రదర్శనకు ఉంచనున్నారు.

Latest News