సోషల్ మీడియా ప్రచారమే గెలుపు సాధనం: సీఎం రేవంత్‌రెడ్డి

సమకాలిన రాజకీయాల్లో పార్టీల విధానాలను ప్రజలకు వేగంగా విశ్లేషణ పూర్వకంగా చేర్చడంలో సోషల్ మీడియా ప్రచారం కీలకంగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు

  • Publish Date - April 26, 2024 / 05:08 PM IST

పార్టీ విధానాలను ఇంటింటికి చేర్చాలి
కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : సమకాలిన రాజకీయాల్లో పార్టీల విధానాలను ప్రజలకు వేగంగా విశ్లేషణ పూర్వకంగా చేర్చడంలో సోషల్ మీడియా ప్రచారం కీలకంగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన టీపీసీసీ సోషల్ మీడియా వారియర్స్ ఆత్మీయ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ సోషల్ మీడియా ప్రచారమే గెలుపు సాధనంగా మారాలని సూచించారు. పార్టీ విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తునే ప్రతిపక్ష ఆరోపణలను తిప్పికొట్టడంలో వేగంగా సమయోచితంగా స్పందించాలన్నారు. నాయకుడు ఎన్ని ప్రసంగాలు చేసినా సరే అది ప్రజలకు చేరాలంటే కేవలం మీ సోషల్ మీడియా ద్వారానే అది సాధ్యమన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి పార్టీని అధికారంలో తేవడంలో ఎంతో కృషి చేశారని అభినందించారు. మీరంతా కలిసికట్టుగా పని చేస్తున్నందునే కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉందని, ఒక యుద్ధం చేయబోతున్నామని, యుద్ధ సమయంలో సైనికులకు వారి సెలవులను రద్దు చేసి యుద్ధంలో పాల్గొనమని చెప్తారని, ఇప్పుడు మనకు కూడా అలాంటి సమయమేనని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధంలో పాల్గొని విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన 2లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని, బీజేపీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేస్తుందన్న అంశాలను పార్టీ సోషల్‌ మీడియా వారియర్స్ బలంగా జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆరెస్‌, బీజేపీలు చేసే విమర్శలను, ఆ పార్టీల గత పదేళ్ల పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామా రాంమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతునే మన పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్ హామీలను వంద రోజుల్లోనే అమలు చేయాలంటున్న బీజేపీ 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన 60సంవత్సరాలు పైబడి రైతులకు పింఛన్ ఇస్తామన్న హామీతో పాటు 2022కల్లా రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పి చేయలేదన్న సంగతి విస్మరించరాదన్నారు.

అలాగే తక్షణమే రుణమాఫీ చేయాలంటున్న బీఆరెస్ ఐదేళ్లకుగాని రుణమాఫీ అదికూడా అరకొర మాత్రమే చేసిందన్న వాస్తవాన్ని గుర్తెరుగాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత సీఎం, కేజీ టూపీజీ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలు బీఆరెస్ విస్మరించిందన్నారు. దక్కన్ క్రానికల్ ఎడిటర్ కర్రి శ్రీరామ్ మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్, సోషల్ మీడియా స్టేట్ కో ఆర్డినేటర్ పెట్టెం నవీన్, రాష్ర్ట కార్యదర్శులు, జిల్లా కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, మండల, గ్రామ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Latest News