విధాత, హైదరాబాద్ : ఢిల్లీలో భారీ వర్షాలకు సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. ఘటనపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మృతుల్లో ఎవరైనా రాష్ట్ర వాసులంటే బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వాసులు ఎవరూ లేరని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. మృతుల్లో తాన్య సోని బీహార్ రాష్ట్రానికి చెందిన యువతి అని, ఆమె తండ్రి విజయ్ కుమార్ సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్‌గా మంచిర్యాలలో పని చేస్తున్నారని ముఖ్యమంత్రికి రెసిడెంట్ కమిషనర్ తెలిపారు. విజయ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెసిడెంట్ కమిషనర్‌ను ఆదేశించారు. తాన్య సోని మృతదేహాన్ని బీహార్ తరలించడానికి వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకుంటున్నారని రెసిడెంట్ కమిషనర్ చెప్పారు. వారి కుటుంబానికి అవసరమైన సహయం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రెసిడెంట్ కమిషనర్ ఉప్పల్ తెలిపారు.
తాన్య కుటుంబానికి సహాయం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఢిల్లీలో భారీ వర్షాలకు ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన ముగ్గురిలో సికింద్రాబాద్‌కు చెందిన తాన్య సోని అనే 25ఏళ్ల యువతి ఉండడంతో తాను మనోవేదనకు గురైనట్లు చెప్పారు. వెంటనే మృతురాలు సోని తండ్రి శ్రీ విజయ్ కుమార్‌ను ఫోన్‌లో పరామర్శించినట్లుగా, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపినట్లుగా వెల్లడించారు. యువతి తండ్రి విజయ్ కుమార్ సింగరేణి శ్రీరామ్‌పూర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. విద్యార్థిని భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా కుటుంబసభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ఢిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి పెండింగ్ ఫార్మాలిటీస్‌ను త్వరగా పూర్తి చేయాలని ఢిల్లీలోని తన కార్యాలయ సిబ్బందిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు.