వేయి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్
బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
విధాత: మనకు గుర్తింపు రావాలంటే సమర్థుడైన ఆటగాడితో పోటీ పడాలని, పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబుతో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపే అవకాశం నాకు వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నేను 12గంటలే పనిచేస్తే చాలనుకునేవాడినని, కాని ఇప్పుడు మనం కూడా చంద్రబాబులా 18గంటలు పనిచేస్తూ ఆయనతో పోటీ పడుదామని తెలంగాణ అధికారులకు, సహచరులకు చెప్పానని రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ ఈ ఆసుపత్రి 24ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషకరమన్నారు.
పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నారని, ఎన్టీఆర్ ఆలోచన విధానాలను కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా చేశారన్నారు. పేదలకు వైద్య సేవలు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు అమలవుతున్న తీరు చూసి ఆయన మనల్ని స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారన్నారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడి పని చేసే అవకాశం నాకు వచ్చిందని, అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలన్నారు.
తెలంగాణలో వేయి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ టూరిజం హబ్ ఉంటుందని, ఇందులో బసవతారకం ఆసుపత్రికి చోటు ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్ కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా హెల్త్ టూరిజం హబ్‌ను తీర్చిదిద్ధుతామన్నారు. రాజకీయం, సంక్షేమం ఎన్టీఆర్ వారసత్వంగా ఇచ్చారని, ఎన్టీఆర్ మూడో తరం కూడా దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నానని రేవంత్ రెడ్డి పేర్కోన్నారు.