CM Revanth Reddy
విధాత,హైదరాబాద్: మూసీ పునరుజ్జీవనమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మూసీ పునరుజ్జీవనంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. ఆ దిశగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. హైదరాబాద్ లో వర్షాలతో తలెత్తే ఇబ్బందులు, వరద సమస్య పరిష్కారంపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైన పరిస్థితులను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండటమే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు.
హైదరాబాద్ నగరంలోని వరదనీరు మూసీలో చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ చెరువు, నాలాలు, ఇతర కాలువలను మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. చెరువులను పునరుద్ధరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటునుంచి మూసీలోకి చేరేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.