నేటి సాయంత్రం లక్ష వరకు మాఫీ
ఈ నెలాఖరులోగా లక్షన్నరలోపు
ఆగస్టు తొలి వారంలో 2 లక్షల రుణాలు
రుణమాఫీపై ప్రచార బైక్ ర్యాలీలు
సంబురాల మధ్య నిర్వహించాలి
దేశమంతా దీనిపై చర్చ జరుగాలి
పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించాలి
పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపు
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2లక్షలలోపు రైతు రుణాల మాఫీ ప్రక్రియను మూడు విడతల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తొలి విడతగా రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు గురువారం సాయంత్రం 4గంటల్లోగా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం ప్రజా భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మూడు విడతల రైతు రుణమాఫీలో భాగంగా ఈ నెలాఖరులోపు రూ.1లక్ష 50వేల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టు మొదటివారంలో రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు.
గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం
గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల్లో మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు. పార్టీకి నష్టమని తెలిసి కూడా ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామని, అయితే.. ఆర్థిక నిపుణులు రుణమాఫీ కష్టమన్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ రూ.28వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని విమర్శించారు.
నా జీవితంలో గుర్తుండిపోయే రోజు
వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ దేశం అనుసరించేలా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రైతు రుణమాఫీ తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రూ. లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ కోసం రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయని తెలిపారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్‌లా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, అందుకే ఏక మొత్తంలో రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు.
హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండి
రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే రుణమాఫీ అని ముఖ్యమంత్రి చెప్పారు. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వివరించాలని కోరారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో రుణమాఫీ ప్రచార సంబురాల కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలని కోరారు. ఈ అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేయలేదని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీని అమలు చేశామని పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించాలని కోరారు. గురువారం గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడలి నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఎక్కడికక్కడ ఒక పండుగ వాతావరణంలో సంబురాలు జరపాలని సూచించారు. ఏడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి రూ.30వేల కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
తల ఎత్తుకొని … ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయండి: డిప్యూటీ సీఎం భట్టి
రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని, రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని, రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్, ప్రతి ఓటర్ దగ్గరకు తీసుకెళ్లాలన్నారు. తల ఎత్తుకుని ఎక్కడా తగ్గకుండా రుణమాఫీ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
రైతన్న “రుణం” తీర్చుకునే…
శుభతరుణం ఇది…శ్రీ రాహుల్ గాంధీ …
ఇచ్చిన మాట నెరవేర్చే…
సంకల్పం ఇది.ప్రతి కాంగ్రెస్ కార్యకర్త…
సగర్వంగా సంబురం చేయాల్సిన…
సందర్భం ఇది.“హస్తం”బంధవులంతా…
అన్నదాత బాంధవులై…
జరపాల్సిన పండుగ…
“రైతు రుణమాఫీ పథకం”#Telangana #RunaMafi pic.twitter.com/OMjSMgIgbq— Revanth Reddy (@revanth_anumula) July 17, 2024
రైతన్న రుణం తీర్చుకునే శుభతరుణం ఇది.. రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కవితాత్మక ట్వీట్
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని రీతిలో ఒకేసారి 31వేల రైతు రుణాల మాఫీకి నిర్ణయించి అమలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీపై తన భావోద్వేగాన్ని ట్విటర్ వేదికగా కవితాత్మక రూపంలో చాటారు. రైతన్న “రుణం” తీర్చుకునే శుభతరుణం ఇది..రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నెరవేర్చే సంకల్పం ఇది..ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సగర్వంగా సంబురం చేయాల్సిన సందర్భం ఇది అని పేర్కోన్నారు. “హస్తం”బంధవులంతా అన్నదాత బాంధవులై జరపాల్సిన పండుగ “రైతు రుణమాఫీ పథకం” అని ట్వట్‌లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2లక్షల రైతు రుణమాఫీలో భాగంగా నేడు గురువారం సాయంత్రంకల్లా లక్ష వరకు రుణాలను 7కోట్ల నిధులతో మాఫీ చేయనుంది. నెలాఖరులో లక్షన్నర వరకు, ఆగస్టు మొదటి వారంలో 2లక్షల వరకు రుణాల మాఫీ చేయనుంది