Revanth Reddy : వార్తలు అడిగి రాయండి

"మంత్రులను బద్నాం చేయవద్దు.. నిజాలు తెలుసుకుని రాయండి!" ఖమ్మం సభలో మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. అయోధ్య తరహాలో భద్రాచలం అభివృద్ధి, సింగరేణిలో అవినీతికి తావులేదని స్పష్టీకరణ.

Revanth Reddy

విధాత : సింగరేణిలో బొగ్గు కుంభకోణం జరుగుతోందన్న ఆంధ్రజ్యోతి వార్త కథనంపై సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ సభ వేదికగా స్పందించారు. ప్రభుత్వంపై వార్తలు రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి, సీఎంగా క్లారిటీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, నిజానిజాలు తెలుసుకొనే రాయండి అంటూ రేవంత్ రెడ్డి మీడియా సంస్థలకు సూచించారు. మా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదని, తప్పుడు ప్రచారాలతో అపోహాలు కల్పించి మళ్లీ బీఆర్ఎస్ శుక్రచార్యుడు, మారీచ, సుభాహులు బలపడేందుకు సహకరించినట్లవుతుందన్నారు. మంత్రులకు, నాకు మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని, మా మంత్రులపై వార్తలు వస్తే నా గౌరవానికి భంగం కలుగుతుంది. మంత్రులమంతా సమన్వయంతో పనిచేస్తున్నాం అన్నారు.

మీ మీడియా సంస్థల యజమానుల మధ్య పంచాయతీలు ఉంటే మీరుమీరు తలుపులు వేసుకుని కొట్టుకొండి..అంతేగాని అందులోకి మమ్మల్ని లాగవద్దని, మంత్రులను బద్నాం చేయవద్దని రేవంత్ రెడ్డి కోరారు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తాం అని, ఇందులో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదు అని రేవంత్ రెడ్డి తెలిపారు. రెండేళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదు అన్నారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది అని, దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అయోధ్యను తలపించేలా భద్రాచలం రామాలయం

భద్రాచలానికి రూ.100 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ ఏమీ ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మా ప్రభుత్వంలో భద్రాచలంలో భూసేకరణ జరుగుతోంది అని, అయోధ్యని తలపించేలా భద్రాచలాన్ని అద్భుతంగా నిర్మిస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ రోజు ఖమ్మంలో రూ.362 కోట్ల అభివృద్ది పనులు ప్రారంభించుకున్నామన్నారు. తాను ఖమ్మం జిల్లా నుంచే రాజకీయ ప్రయాణం ప్రారంభించానని తెలిపారు. గత ప్రభుత్వంలో రేషన్‌కార్డు రావాలంటే ఉన్నవాళ్లలో ఎవరో ఒకరు చనిపోవాలనే పరిస్థితి ఉండేది అని, మా ప్రజాపాలనలో లక్షలాది రేషన్‌కార్డులు పేదలకు అందించాం అని వెల్లడించారు. గతంలో ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసి రైతుల సమస్యలు తీర్చిన ఘనత వైఎస్సార్‌దే అని గుర్తు చేశారు. ఇప్పుడు పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం అని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పేదవాడిపై కుట్ర చేసి ఇళ్లు ఇవ్వకుండా చేసింది అని, అందుకే పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంది అని, మేంఅధికారంలోకి వచ్చాక 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం అని తెలిపారు. గతంలో ఎన్టీఆర్‌ రూ.2 కిలో బియ్యం ప్రవేశపెడితే..నేడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ సారథ్యంలో ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామని అని గుర్తు చేశారు. రాష్ట్రంలో అభివృద్దికి అడ్డుపడుతున్న బీఆర్ఎస్ ను బొందపెట్టాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :


Mahesh Babu | హీరోయిన్ ఎంగిలి తాగ‌మ‌న్న డైరెక్ట‌ర్.. సెట్‌లో ఒక్కసారిగా మారిన సూపర్ స్టార్ మూడ్‌..
AR Rahman vs Kangana Ranaut : భారత్ నాకు ఇల్లు..వివాదస్పద వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ

Latest News