Mahesh Babu | టాలీవుడ్‌లో మహేష్ బాబు అంటే కూల్‌నెస్, క్రమశిక్షణ, వివాదాలకు దూరం అనే మాటలు వెంటనే గుర్తొస్తాయి. షూటింగ్ సమయంలో పూర్తిగా తన పాత్రపై దృష్టి పెట్టడం, అనవసర చర్చలకు దూరంగా ఉండటం ఆయనకు ఉన్న ప్రత్యేకత. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, మహేష్ పని గంటల్లో ఫోన్ కూడా పక్కన పెట్టరని, పూర్తి ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. అయితే ఇలాంటి ఇమేజ్ ఉన్న మహేష్ కెరీర్ ప్రారంభ దశలో ఒక సందర్భంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించారన్న విషయం ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.
కెరీర్ ఆరంభంలో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా బాల నటుడిగా కెమెరా ముందుకొచ్చిన మహేష్ బాబు, హీరోగా 1999లో విడుదలైన ‘రాజకుమారుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వైజయంతి మూవీస్ నిర్మాణంలో, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ప్రీతీ జింటా హీరోయిన్‌గా నటించారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ రొమాంటిక్ సీన్ విషయంలో అనుకోని పరిణామం చోటు చేసుకుందట. రాఘవేంద్రరావు తన ప్రత్యేక శైలిలో ఒక లవ్ సీన్ డిజైన్ చేయగా, అందులో హీరో-హీరోయిన్ ఒకే కూల్ డ్రింక్‌ను రెండు స్ట్రాలతో తాగాలి అనే ఆలోచన పెట్టారట. ఈ సీన్‌కి మహేష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది.
డైరెక్టర్ ఆలోచనకు మహేష్ నో!
హీరోయిన్ తాగిన డ్రింక్‌ను తాను తాగడం తనకు ఇష్టం లేదని, ఆ సీన్ చేయలేనని మహేష్ స్పష్టంగా చెప్పారని సమాచారం. ఆ సమయంలో భావోద్వేగానికి లోనై, షూటింగ్ మధ్యలోనే సెట్స్‌ను విడిచిపెట్టారన్న కథ కూడా వినిపించింది. అయితే దర్శకుడితో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే మహేష్ తన అసహనాన్ని ఓపెన్‌గా వ్యక్తం చేయగలిగారని సినీ వర్గాలు చెబుతాయి. రాఘవేంద్రరావును మహేష్ “మావయ్య” అని పిలిచేంత చనువు ఉండటమే ఇందుకు కారణమట.
తర్వాత పరిస్థితిని సర్దుబాటు చేసి, ఆ సీన్‌ను టెక్నికల్‌గా రెండు వేర్వేరు షాట్లలో చిత్రీకరించారని, నిజానికి ఇద్దరూ ఒకే డ్రింక్ తాగలేదని టాక్. కానీ అప్పట్లో మహేష్ నిజంగానే అలా చేయాల్సి వస్తుందేమో అన్న భావనతో అలిగారని సోషల్ మీడియాలో ఈ సంఘటన వైరల్ అయింది.
ఇప్పటి మహేష్ పూర్తిగా వేరే లెవెల్
ఈ సంఘటన నిజమా కాదా అన్నది పక్కనపెడితే, కెరీర్ ప్రారంభంలో జరిగిన ఈ విషయం ఇప్పుడు అభిమానులకు ఆసక్తికర అనుభవంగా మారింది. కాలక్రమేణా మహేష్ బాబు తన నటన, ప్రొఫెషనలిజంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫెయిల్యూర్స్ వచ్చినా వెనక్కి తగ్గకుండా, సరైన కథలతో తిరిగి నిలబడి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు.ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’లో నటిస్తున్నారు. దాదాపు 1500 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కూల్‌నెస్‌కు కేరాఫ్‌గా మారిన మహేష్, ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో తన స్టాంప్ వేయడానికి సిద్ధమవుతున్నాడు.
