విధాత: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంపై తను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని స్పష్టం చేస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.వీడియోలో రెహమాన్ మాట్లాడుతూ… తాను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టాలనుకోలేదని చెప్పారు. ‘భారత్ నాకు ఇల్లు. ఇక్కడే నేను సంగీతాన్ని నేర్చుకున్నాను. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలే నాకు గురువులు. నేను ఎప్పుడూ దేశాన్ని, ప్రజలను విమర్శించలేదు. భారత్ నాకు ఎప్పటికీ స్ఫూర్తి అని స్పష్టం చేశారు. సంగీతానికి, కళాకారులకు గౌరవం తగ్గిందన్నదే నా ఉద్దేశం అని వివరణ ఇచ్చారు. ఒకప్పుడు సంగీతానికి ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు తగ్గుతోంది అని..కమర్షియల్ అంశాలే ఎక్కువ అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో నేను చేసిన వ్యాఖ్యలను మతంతో ముడిపెట్టి చూడడం సరైంది కాదు అని, నేను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు అని స్పష్టం చేశారు. కళ, సంగీతం, దేశం పట్ల నా ప్రేమ ఎప్పటికీ మారదు. నా నిజాయితీని గుర్తిస్తారని ఆశిస్తున్నా’ అని వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.
అంతకుముందు రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు తగ్గడానికి పలు కారణాలు ఉండొచ్చని, అందులో మతం కూడా ఒక కారణం అయి ఉండవచ్చేమో అనే భావన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..కొందరు మద్దతు తెలపగా, మరికొందరు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రెహమాన్ వ్యాఖ్యలను కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు, సోషల్ మీడియా యూజర్లు ఘాటుగా స్పందించారు. మతాన్ని ప్రస్తావన తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్
బాలీవుడ్‌లో మతపరమైన ధోరణులు పెరిగాయంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. తన ‘ఎమర్జెన్సీ’ సినిమా సమయంలో ఆయన నుంచి చేదు అనుభవం ఎదురైందని, ఈ సినిమాకు సంగీతం అందించాల్సిందిగా కోరుతూ కథ వినిపించడానికి తాను రెహమాన్‌ను సంప్రదించగా.. ఆయన కనీసం తనను కలవడానికి కూడా నిరాకరించారని ఆమె ఆరోపించారు. ‘ఎమర్జెన్సీ’ ఒక ప్రచార చిత్రం (ప్రొపగాండా) అని భావించి అందులో భాగం కావడానికి ఆయన ఇష్టపడలేదని తనకు తెలిసిందని కంగనా పేర్కొన్నారు.
ఆయన కంటే పక్షపాతం, ద్వేషపూరితమైన వ్యక్తిని తాను ఇప్పటి వరకు చూడలేదని ద్వేషంతో ఆయన కళ్లు మూసుకుపోయాయని విమర్శించారు. తన సినిమాను విమర్శకులు ‘మాస్టర్ పీస్’ అని కొనియాడారని, చివరకు ప్రతిపక్ష నాయకులు సైతం తన సినిమాను మెచ్చుకుంటూ తనకు లేఖలు రాశారని కానీ రెహమాన్ మాత్రం తన పట్ల వివక్ష చూపారని కంగానా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా గురించి కూడా కంగానా స్పందించారు. గతంలో రామ్ జన్మభూమి దర్శనానికి వెళ్లే సమయంలో మసాబా తనకు చీర ఇవ్వడానికి నిరాకరించిందని, ఆ అవమానాన్ని తట్టుకోలేక తాను కారులోనే ఏడ్చానని కంగనా రనౌత్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Medaram Jatara : మేడారంపై అడుగడుగునా పోలీసుల డేగకళ్ళ నిఘా
Leopard Attack| యాదాద్రి భువనగిరి జిల్లాలో చిరుత కలకలం
