విధాత : ప్రైవేటు విద్యాసంస్థలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల పేరుతో విద్యాసంస్థల బంద్ పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని, వారి విద్యా సంస్ధ బంద్ వెనుక ఏ రాజకీయ పార్టీ ఉందో మాకు తెలియదా అంటూ మండిపడ్డారు. తమాషా చేస్తే తాటతీస్తాం అని.. విద్య అనేది సేవా, వ్యాపారం చేస్తామంటే కుదరదు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా.. అధికారులను ఎలా తిడతారు అని ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ నాయకులు ముగ్గురి గురించి నాకు, మీకు తెలియదా ..ఆరోరా రమేష్ కు ఎన్ని అనుమతులు ఇవ్వాలి అంటూ ప్రశ్నించారు. వారు ఎన్ని డొనేషన్ల వసూలు చేస్తున్నారో నాకు తెలియదా..చూద్దాం వచ్చే ఏడాది నుంచి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో అంటూ ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే సాగదన్నారు.
విద్యార్థులను వెనక్కి ఎట్లా తిప్పాలో తెలుసు అని..ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఆ పని చేయడం లేదు అని రేవంత్ రెడ్డి అసహనంవ్యక్తం చేశారు. విడతల వారీగా ఫీజు రీయంబర్స్ మెంటు నిధులు ఇస్తాం అని.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని సూచించారు. కాలేజీలు నడపకుండా బంద్ పెట్టారు..బంద్ పెట్టి మరి ఫీజులు అడగరా అంటూ ప్రశ్నించారు. కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదు అన్నారు.
