విధాత: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ఎందుకు జరగడం లేదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థాన్ నారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్, వైద్య సిబ్బందిని పిలిచి రికార్డులను తనిఖీ చేశారు.
నవంబర్, డిసెంబర్ నెలలో ఎంతమంది ప్రసవాలు చేశారని ప్రశ్నించారు. నవంబర్ నెలలో నాలుగు, డిసెంబర్ నెలలో ఇప్పటివరకు మూడు ప్రసవాలను ఆసుపత్రిలో చేసినట్లు సిబ్బంది వివరించారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ పమేలా సత్పతి ప్రతి నెల 50 నుంచి 70 వరకు ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాల్సి ఉందన్నారు.
ఒక్కొక్క ఏఎన్ఎం, ఆశ కార్యకర్త ప్రతి నెల ఐదు నుంచి ఆరుగురిని ప్రసవాలకు తీసుకు రావాల్సి ఉంటుందని తెలియదా అని ప్రశ్నించారు. ప్రసవాలపై ఎందుకు రివ్యూ చేయడం లేదని డాక్టర్ నరేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సిబ్బంది 24 గంటలు ఇక్కడ పని చేస్తున్నారా లేదా అని నిలదీశారు.
ఇంతమంది సిబ్బంది ఉన్నా ప్రైవేటు ఆసుపత్రులలో ప్రసవాలు జరుగుతున్నాయని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ప్రసవాలపై వైద్య సిబ్బంది సక్రమంగా పనిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో రాములు, పంచాయతీ కార్యదర్శి నరేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.