Site icon vidhaatha

19న మరోసారి క్రమశిక్షణ సంఘం భేటీ…రాజగోపాల్ రెడ్డిపై చర్యలుంటాయా?

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 17 (విధాత): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఈ నెల 19న కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చర్చించనుంది. ఆదివారం నాటి సమావేశంలో వరంగల్, గజ్వేల్‌లో పరిణామాలపై అంశాలపై చర్చించారు. రాజగోపాల్ రెడ్డి అంశంపై మంగళవారం చర్చిస్తామని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ మల్లు రవి ప్రకటించారు. కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సమావేశం జరుగుతున్న సమయంలోనే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై వివరాల సేకరణ
మంత్రి వర్గంలో చోటు దక్కలేదనే అసంతృప్తితో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకత్వంపై వరుసగా విమర్శలు చేశారు. ఆయన విమర్శలను కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సిఫారసు చేశారు. శనివారం ఉదయమే కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ మల్లు రవికి మహేశ్‌గౌడ్‌ ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తామని మహేశ్ గౌడ్ అన్నారు. ఇప్పటివరకు సీఎంపై, కాంగ్రెస్ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి ఏ రకమైన వ్యాఖ్యలు చేశారు? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, మీడియాతో బహిరంగంగా ఏం మాట్లాడారనే విషయాలపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఆరా తీస్తోంది. దీనికి సంబంధించిన మీడియాలో వచ్చిన కథనాలు, వీడియోలను కూడా క్రమశిక్షణ సంఘం పరిశీలించనుందని సమాచారం. ఉద్దేశపూర్వకంగానే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా? ఇతరత్రా కారణాలున్నాయా అనే అంశాలపై కూడా క్రమశిక్షణ సంఘం ఆరా తీసే అవకాశం ఉంది.

నోటీసులిస్తారా?
కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఈ నెల 19న మరోసారి భేటీ కానుంది. ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి అంశంపైనే చర్చించనున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు చేసిన విమర్శలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, వీడియో క్లిప్పింగ్స్ ను కూడా ఈ సమావేశంలో క్రమశిక్షణ సంఘం సభ్యులు పరిశీలించే చాన్స్‌ ఉంది. వీటి ఆధారంగా రాజగోపాల్ రెడ్డికి నోటీసులిచ్చి పిలుస్తారా లేదా అనేది మంగళవారం సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వివాదం, కులగణన విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై పార్టీ సీరియస్ అయింది. వివరణ ఇవ్వనందున మల్లన్నను సస్పెండ్ చేశారు. కొండా మురళి రెండుసార్లు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై తన వాదన వినిపించారు. వైరి వర్గంపై కొండా మురళి ఫిర్యాదు చేశారు. గజ్వేల్ గొడవకు సంబంధించి ఫిర్యాదు మేరకు దీనిపై క్రమశిక్షణ సంఘం చర్చించింది. ఈ గొడవ జరిగిన సమయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నందున ఆయన నుంచి కూడా వివరాలు సేకరించనున్నారు. ఈ ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం. ఇక రాజగోపాల్ రెడ్డి అంశానికి సంబంధించి ఇంతవరకు పార్టీ నాయకులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. శనివారం ఈ విషయమై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ మల్లు రవికి ఫోన్ చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఈ విషయమై ఫోకస్ పెట్టింది.

రాజగోపాల్ రెడ్డిపై చర్యలుంటాయా?
రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ అధిష్టానంపై చేసిన వ్యాఖ్యల గురించి రాజగోపాల్ రెడ్డి నుంచి క్రమశిక్షణ సంఘం వివరణ కోరే అవకాశం ఉంది. దీనిపై రాజగోపాల్ రెడ్డి ఇచ్చే సమాధానం ఆధారంగా ఏం చేయాలనే దానిపై క్రమశిక్షణ సంఘం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు ఉండకపోవచ్చనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. భవిష్యత్తులో మరొకరు ఇలా మాట్లాడకుండా ఉండేందుకు రాజగోపాల్ రెడ్డి అంశాన్ని క్రమశిక్షణ సంఘానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సిఫారసు చేసి ఉంటారనే చర్చ సాగుతోంది. క్రమశిక్షణ సంఘానికి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సిఫారసు చేయడమంటేనే ఆయన వ్యాఖ్యలకు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం రంగం సిద్దం చేసిందనే చర్చ కూడా సాగుతోంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం భేటీ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల అంశంతో పాటు పీఏసీ, స్థానిక సంస్థలు, నామినేటేడ్ పదవుల విషయంలో చర్చించినట్టు సమాచారం.

Exit mobile version