విధాత : మాది అధికారుల, ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ప్రభుత్వ నిర్ణయాలు అట్టడుగు ప్రజలకు చేరాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడేద్దుల్లాగా పనిచేయాలని, సమన్వయం లేకుంటే అనుకున్నలక్ష్యం దిశగా వెళ్లలేమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడారు. విధి నిర్వహణలో ఉద్యోగులు ఉద్ధేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తే సమీక్షించి తగు నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులేనన్నారు. ప్రభుత్వం సచివాలయం స్థాయిలో తీసుకునే నిర్ణయాలు, ఎన్నికల టైమ్ లో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీల మొదలు గ్రామ స్థాయి వరకు సమిష్టిగా, చిత్తశుద్ధితో కృషి చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఏ ఒక్కరు వెనకబడినా ఆ మేరకు తేడాలు ఉంటాయన్నారు.
అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు మాత్రమే కాదని, పేదలకు, చిట్టచివరి వరుసలో ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సంక్షేమం అందినప్పుడే అభివృద్ధి సార్థకమవుతుందని అంబేద్కర్ మాటలను సీఎం రేవంత్ గుర్తుచేశారు. ప్రభుత్వం చాలా నమ్మకంతో, విశ్వాసంతో, ధీమాతో అభయహస్తం కార్యక్రమాన్ని అమలుచేసే బాధ్యత మీకు అప్పచెబుతుందన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు మీరే మా సారధులని, లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు రిపీట్ కావద్దని, అందుకు ప్రజల్లో కలిసిపోయి పనిచేస్తూ శభాష్ అని అనిపించుకోవాలని సూచించారు. తండాలు, గూడేలు, గ్రామాల్లోని వారికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నారు.
28నుంచి గ్రామసభలు
ఈ నెల 28నుంచి జనవరి 6వరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. పూర్తి స్థాయి మార్గదర్శకాలు వెల్లడిస్తామన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు దఫాలుగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. గ్రామసభలు ద్వారా అర్హులైన లబ్దిదారులను గుర్తించాలన్నారు. ప్రతి నాలుగు నెలలకొకసారి గ్రామసభలపై సమీక్ష ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యేక నేపథ్యం ఉన్నదని, ఎన్నో ఆకాంక్షలతో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమంలోకి దూకారన్నారు. ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలన్నారు. అదికారులు జవాబుదారీగా పనిచేసి ప్రజల మనసు గెలుచుకోవాలని, వారే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారనన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నింటినీ సహిస్తారు.. కానీ వారి డీఎన్‌ఏ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరని, ఎంతటివారినైనా ఇంటికి పంపే చైతన్యం రాష్ట్ర ప్రజల్లో ఉందన్నారు. ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సామాజికంగా అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రజలు సహించరని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని, ప్రజలతో మమేకం కావాలన్నారు. నిస్సహాయులకు సాయం అందాలని, గతంలో ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ ఇందుకోసం ఉదయం 9 గంటలకు సచివాలయానికి వచ్చి రాత్రి వరకూ ప్రజల బాధలకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టి తన వంతు కృషి చేశారని గుర్తుచేశారు. అయన బాధ్యతను, కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ఇచ్చినా దాన్ని సున్నితంగా తిరస్కరించారని, తాము తన బాధ్యతను మాత్రమే నిర్వర్తించానని వివరించారని సీఎం గుర్తుచేశారు. ప్రభుత్వం చాల ఓపెన్ మైండ్‌తో అధికారులు ఇచ్చే సూచనలను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
సొంత రాష్ట్రాన్ని, గ్రామాన్ని వదిలి తెలంగాణలో పనిచేయడానికి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 35 ఏళ్ళ సగటు సర్వీసులో ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా విధుల్లో చేరారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ప్రజలతో పాటు అధికారులు కూడా భాగస్వాములని గుర్తుచేశారు. ప్రజలకు దగ్గరగా లేకపోయినా, వారి విశ్వాసాన్ని చూరగొనలేకపోయినా సమస్యలను అవగాహన చేసుకోలేరని, అర్థం చేసుకోలేరని, పరిష్కారాన్ని చూపలేరన్నారు.
పోలీసులకు పూర్తి స్వేచ్చ..పనిచేయలేని వారు తప్పుకోవచ్చు
సీఎం రేవంత్‌రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్‌లతో నిర్వహించిన సమావేశంలో అధికారులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు రోజుకు 18గంటలు పనిచేయాలని స్పష్టం చేశారు. పని చేయడం కుదరనుకునేవారు, ఇష్టం లేని వాళ్లు సీఎస్, డీజీపీలకు చెప్పి తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చన్నారు. బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నామని, డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు, నేరాల నియంత్రణకు ఖచ్చితంగా పనిచేయాలన్నారు.
గంజాయి, డ్రగ్స్ కాలేజీల వరకు చేరాయని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. అక్రమార్కులు, కబ్జాదారులను విడిచిపెట్టోదన్నారు. సన్ బర్న్ ఈవెంట్ పైన, బుక్ మై షో బుకింగ్ పైన, నకిలీ విత్తన విక్రయ సంస్థలపైన ఫోకస్ పెట్టాలని సూచించారు. నకిలీ విత్తనాలు టెర్రరిజానికంటే డేంజర్ అన్నారు.