విధాత : బీఆరెస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాంగ్రెస్‌లో చేరబోరని, మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆరెస్‌లోకి వలసల వరద పొటెత్తనుందని మాజీ మంత్రి, బీఆరెస్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో కరీంనగర్ లోక్ సభ స్థానం ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లు ఒక్కరిని తీసుకెళ్తే బీఆరెస్‌లోకి పది మంది వస్తారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు మా పార్టీ నేతలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. మేం బీఆరెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై చర్చిస్తున్నామని తెలిపారు.
మా పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడటంలో పస లేదని, మంత్రి పదవి కోసం ఆయన అలా మాట్లాడి ఉంటారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆరెస్ డిమాండ్ చేస్తుందన్నారు. రైతుబంధు డబ్బులను డిసెంబర్ 9న వేస్తామని ఇప్పటిదాకా వేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఇంత వ్యతిరేకత గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. కాంగ్రెస్ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని, ఇప్పుడు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందని దుయ్యబట్టారు.
అంతకుముందు కరీంనగర్ లోక్‌సభ సన్నాహాక సమావేశంలోపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, మహమూద్ అలీ, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనా చారి, బీఆరెస్ జనరల్ సెక్రెటరీ కే.కేశవరావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు