Site icon vidhaatha

Congress vs BRS | విదేశీ పెట్టుబడుల సాధనపై బీఆరెస్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్‌

బాహుబలి..భల్లాల దేవుడు పాత్రలతో పెట్టుబడుల లెక్కల ట్వీట్‌

విధాత, హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటనపై బీఆరెస్ సోషల్ మీడియా సాగిస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం కూడా దూకుడు పెంచింది. తాజాగా బాహుబలి సినీమాకు పెట్టుబడుల సాధనకు ముడిపెట్టి కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. గతంలో మంత్రిగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిలు సాధించిన విదేశీ పెట్టుబడుల మధ్య తేడాలను భల్లాలదేవుడు, బాహుబలి పాత్రలతో పోల్చి విశ్లేషిస్తూ వీడియో పోస్టు చేశారు. కేటీఆర్‌ను భల్లాల దేవుడి పాత్రతో పోల్చుతూ ఆయన హయంలో 21వేల పెట్టుబడులు మాత్రమే రాబట్టారని, బాహుబలి సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌, అమెరికా పర్యటనలలో 72వేల కోట్ల పెట్టుబడులు సాధించారంటూ కాంగ్రెస్ అపన్న హస్తం పేరిట ట్వీటర్‌లో మిక్సింగ్ వీడియో పోస్టు చేశారు.

అంతకుముందు బీఆరెస్ సోషల్ మీడియా సైతం సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో సాధించినట్లుగా చూపిన పెట్టుబడుల ఒప్పందాల్లో షెల్ కంపనీలున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు జగదీశ్‌రెడ్డి స్థాపించిన స్వచ్ఛ్ బయో కంపనీ కూడా వేయి కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుందని, గతంలో బీఆరెస్ హయంలో జరిగిన ఒప్పందాలను కూడా కొత్తగా చూపించారని, తాను విపక్ష నేతగా అవినీతి పరుడని ఆరోపించిన ఫినిక్స్ చైర్మన్ సురేశ్‌ చుక్కానితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారని రకరకాల ఆరోపణలతో కాంగ్రెస్‌పై ముప్పేట దాడి సాగించారు. సీఎం అమెరికా పర్యటన ఒక ‘పీఆర్ డిజాస్టర్’ అని బీఆరెస్‌ సోషల్ మీడియా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. దీంతో కాంగ్రెస్ సోషల్ మీడియా బృందం కూడా బీఆరెస్‌పై ఎదురుదాడికి దిగింది

Exit mobile version