Site icon vidhaatha

CPI Leader Srinivas Rao : సాయుధ పోరాటానికి మతోన్మాదుల వక్రీకరణ

CPI Srinivas Rao

విధాత, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ సాయుధ పోరాటాన్ని మతోన్మోదులు వక్రీకరిస్తున్నారని, ఈ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. చరిత్రను తప్పుదోవపట్టించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఈ నెల 11 నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా హనుమకొండ జిల్లా రాంపూర్లో గురువారం హనుమంతరావు స్థూపం వద్ద వార్షికోత్సవ సభ నిర్వహించారు. సభకు ముందుగా నివాళులు అర్పించారు. శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ నైజాం పై పోరాటాన్ని హిందూ, ముస్లింల గొడవగా చిత్రీకరిస్తున్నదని అన్నారు. నాటి పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ఏ మాత్రం లేదని, ఈ పోరాటానికి వారసులు ఒక్క కమ్యూనిస్టులేనని అన్నారు. భూస్వాములకు, దోపిడీ దారులకు నైజాం సర్కారు అండగా ఉన్నందున నైజాం సర్కారు పై సాయుధ పోరాటం చేశారన్నారు.

తెలంగాణ విలీన దినోత్సవంపై అధికార పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని, ట్యాంక్ బండ్ పై పోరాట యోధుల విగ్రహాలు పెడతామని, పాఠ్యపుస్తకాల్లో చరిత్రను చేర్చుతామన్న హామీలను ఎందుకు నెరవేర్చలేదని విమర్శించారు. సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమి పంచారని, వేల గ్రామాలను విముక్తి చేశారని, ఈ పోరాటంలో దొడ్డి కొమరయ్యతో ప్రారంభమై నాలుగున్నర వేల మంది వీరులు అమరులయ్యారని గుర్తుచేశారు. గ్రామ గ్రామాన నాటి నెత్తుటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. బీజేపీకి తెలంగాణ విలీన దినోత్సవంపై మాట్లాడే హక్కు లేదన్నారు. సాయుధ పోరాటాన్ని, అమరుల జీవిత చరిత్రలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలుగా చేర్చడంతో పాటు, విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కర్రే బిక్షపతి, నేదునూరి జ్యోతి, ఆదరి శ్రీనివాస్, మద్దెల ఎల్లేష్, తోట బిక్షపతి, ఎన్ ఎ స్టాలిన్, మునిగాల బిక్షపతి, కర్రే లక్ష్మణ్, బత్తిని సదానందం, యేషబోయిన శ్రీనివాస్, కొట్టేపాక రవి, వేల్పుల సారంగపాణి, అలువాల రాజు, బొట్టు బిక్షపతి, కొట్టే వెంకటేష్, లకవత్ లక్ష్మీ, దండు సుమన్, గోకుల రాజయ్య, మునిగాల ఐలయ్య, రాజరాపు రాజు, పసునూరి సునీల్, మునిగాల రాజు, రీల్ పూర్ణచందర్, బైరపాక అన్నమ్మ, మడికంటి లావణ్య, సారమ్మ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version