జనగామ, సెప్టెంబర్ 17 (విధాత):
Telangana Peasants Armed Struggle | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరింస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను నిలదీయాలని సీపీఎం జాతీయ కార్యదర్శి ఏంఎ బేబీ పిలుపునిచ్చారు. వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో అమరులైన వీరులను తలచుకుంటూ సెప్టెంబర్ 1నుండి 17వరకు జిల్లాలో ఉత్సవాలను నిర్వహించారు. బుధవారం ముగింపు సభకు హాజరైన ఎంఏ బేబీని సీపీఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన పట్టణంలోని కళ్లెం కమాన్ వద్ద పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎంఏ బేబీ మాట్లాడారు. 1871 ఫ్రాన్స్‌లో పారీస్ కమ్యూన్ ఉద్యమంలో కార్మికులు తమ హక్కుల కోసం 70 రోజులపాటు పోరాటం చేస్తే తెలంగాణలో 1946- 51 వరకు అంటే 5సంవత్సరాలు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందన్నారు.
ఈ పోరాట ఫలితంగా భూసంస్కరణల చట్టం తెలంగాణలో అమలయిందన్నారు. చరిత్రలో పారీస్ కమ్యూన్ కంటే తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం చాలా గొప్పదని అన్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తి మనకు అర్ధం అవుతుందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తెలంగాణలో విమోచన పేరుతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చూపించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దేశంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మోదీ పార్లమెంట్‌లో మైనింగ్ చట్టాలు అంబానికి, ఆదానికి అనుకూలంగా చేస్తూ గనులను కట్టబెడుతున్నారని ఆరోపించారు.
మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ మాత్రమే 4 లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై అధిక పన్నులు వేస్తున్నా మోదీ మాత్రం బెల్లం కొట్టిన రాయిలా ఉన్నారని ఎద్దెవా చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మొహమ్మద్ అబ్బాస్, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి విట్టల్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, బూడిది గోపి, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేష్, రాపర్తి సోమన్న, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శులు, పట్టణ కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.