Site icon vidhaatha

CPM MA Baby | ఆరెస్సెస్‌ను కీర్తించడం అమరుల స్మృతికి అగౌరవం : సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ

CPM MA Baby | స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆరెస్సెస్‌ను ప్రధాని మోదీ కీర్తించడాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తీవ్రంగా ఖండించారు. ఇది అమరుల స్మృతిని అగౌరవపర్చడమేనని అన్నారు. చారిత్రకంగా ద్వంద్వం ప్రమాణాల రికార్డు కలిగి ఉన్న ఆరెస్సెస్‌ను ప్రశంసించడం తీవ్ర విచారకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. మహాత్మా గాంధీ హత్య అనంతరం ఆరెస్సెస్‌ను నిషేధించిన సంగతిని ఆయన ప్రస్తావించారు. అనేక మంది చరిత్రకారులు సైతం మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఆరెస్సెస్‌ పాత్రను రికార్డు చేశారని గుర్తు చేశారు.

‘79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రిటిష్‌ వలస పాలన నుంచి స్వాతంత్య్రం కోసం భారతదేశ ప్రయాణం సుదీర్ఘమైనది, ఎన్నో ప్రయాసలతో కూడినది. షహీద్‌ భగత్‌ సింగ్‌, అష్ఫుఖుల్లా ఖాన్‌ వంటి అమరవీరుల జ్ఞాపకాలు ఈ ఒక్కరోజే కాదు.. ప్రతి రోజూ మన మనుసులలో ఉంటాయి’ అని ఎంఏ బేబీ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ‘మహాత్మా గాంధీ నుంచి సుభాష్‌ చంద్రబోస్‌ వరకు.. మౌలానా అబుల్‌ కలా ఆజాద్‌ నుంచి.. కామ్రేడ్‌ పీ కృష్ణ పిళ్లై. ఈఎంఎస్‌ నంబూద్రిపాద్, ఏకే గోపాలన్‌, అక్కమ్మ చెరియన్‌ వరకూ ఇంకా అనేక మంది నిస్వార్థపూరిత పోరాటాలతో మన స్వాతంత్య్రానికి పునాదులు వేశారు’ అని బేబీ గుర్తు చేశారు. ఆరెస్స్‌ను కీర్తించడం ద్వారా మన అమరవీరుల స్మృతిని, స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రధానమంత్రి అగౌరవపర్చారని మండిపడ్డారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆరెస్సెస్‌కు కనీస పాత్ర లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటి సంస్థను కీర్తించడం ఆమోదయోగ్యం కాదని, సిగ్గు చేటని విమర్శించారు.

Exit mobile version