- నక్సల్బరీ ప్రజా యుద్ధ బాటే – దేశ విముక్తికి మార్గమని ఎలుగెత్తి చాటుదాం!
- విప్లవ ప్రతిఘాతుక కగార్ ఆపరేషన్ ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దాం
- మావోయిస్ట్ పార్టీ జేఎండబ్లుపి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్
విధాత ప్రత్యేక ప్రతినిధి : ఈనెల 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు విప్లవ అమరవీరుల వారోత్సవాలను జరపాలని జేఎండబ్లుపి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.
భారత విప్లవ మార్గదర్శకులు కామ్రేడ్ చారు మజుందార్ 1972 జూలై 28 న, కామ్రేడ్ కాన్హాయ్ చటర్జీ 1982 జూలై 18న అమరులయ్యారు. ఆ ఇద్దరు నాయకులు సాయుధ పోరాటాన్ని, ప్రజా యుద్దాన్ని దేశ రాజకీయ ఎజెండా మీదికి తెచ్చారు. వాల్లు చూపిన మార్గంలో దీర్ఘ కాలిక సాయుధ పోరాట మార్గంలో విప్లవోద్యమం పురోగమిస్తోంది. ఈ విప్లవోద్యమ పురోగమనం క్రమంలో పోలిట్ బ్యూరో నుండి సాధారణ ప్రజల వరకు వీర వనితలు, వీరులు తమ నులివెచ్చని రక్తాన్ని దార పోసి ప్రాణాలు అర్పించారు. గత జూలై నుండి ఇప్పటి వరకు 200ల మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి రకరకాల పేర్లతో విప్లవ ప్రతిఘాతుక సూరజ్ కుండ్, కాగార్ దాడులను ఎదుర్కొంటు విరోచితంగా పోరాడుతు అమరులయ్యారు.
ఈ అమరులందరిని స్మరించుకోవడానికి జూలై 28న జరుపుకుంటున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే, అయితే ఈ సంవత్సరం బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై సంయుక్తంగా అత్యంత క్రూరమైన కగార్ ఆపరేషన్ దాడుల మధ్య జరుపుకుంటున్నాం.
బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు బీజేపీ ప్రధానమంత్రి నాయకత్వంలో సామ్రాజ్య వాదుల, కార్పొరేట్ల ప్రయోజనాలను నెరవేర్చడానికి పీడిత ప్రజల శ్రమను, సహజ వనరులను తమ ఇష్టానుసారంగా లూటీ చేసేందుకు నవ భారత్, వికసిత్ భారత్ పేరుతో 2047 వరకు దేశాన్ని బ్రాహ్మణీయ హిందూ రాజ్యం నిర్మించే లక్ష్యంతో వారి ఎజెండాను అమలు చేస్తున్నది.
బి ఆర్ ఎస్ పార్టీ అధికారాన్ని ప్రజలు కూల్చివేసి బుద్ధి చెప్పారు. ఆరు గ్యారంటీలతో పాటు, ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలు గడవక ముందే ప్రశ్నిస్తున్న ప్రగతిశీల, ప్రజాస్వామిక లౌకిక. శక్తులపై దాడులు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారు, అమాయక ప్రజలను మావోయిస్టులకు సహకరిస్తున్నారనే పేరుతో అక్రమ కేసులు పెట్టిన అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరుల బాటలో ముందుకు సాగుదామని భారత కమ్యునిస్ట్ పార్టీ (మావోయిస్ట్) కార్యదర్శి వెంకటేష్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.