విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Tippiri Thirupathi | తాను తన రాజకీయ జీవితాన్ని కచ్చితంగా కొనసాగిస్తానని మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా ప్రస్తుతం రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి వచ్చాను తప్ప వ్యక్తిగత జీవితం కోసం నేను బయటకు రాలేదన్నారు. ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాటం చేస్తామని తెలిపారు. దశాబ్దాలుగా తాము నమ్మిన సిద్ధాంతం ప్రకారం ప్రజల పక్షాన పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా మీడియా పలు ప్రశ్నలు సంధించగా ఇప్పుడున్న పరిస్థితిని అర్ధం చేసుకోవాలని విన్నవించారు. అనవసర అపార్ధాలు, అపోహలకు దారితీయకుండా మరో సందర్భంలో సవివరమైన సమాధానం చెబుతామన్నారు.
పార్లమెంటరీ వ్యవస్థలోకి పోవాలని కాదు: మల్లా రాజిరెడ్డి
ప్రజా సమస్యల పై ప్రజల తరుపున ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేస్తామని మల్లా రాజిరెడ్డి చెప్పారు. దీనర్ధం పార్లమెంటరీ వ్యవస్థలోకి పోవాలనేది కాదన్నారు. ప్రజల సమస్యలపై ప్రజల తరఫున ప్రజలతో కలిసి పనిచేస్తాం అని తెలిపారు. ప్రజల సమస్యలపై జరిగే పోరాటాలను సంఘటితం చేయడం కోసం చట్ట పరిధిలో పనిచేయాలని ఆలోచించామని, అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజల పోరాటాల వెనుక నిలబడతామని హామీ ఇస్తున్నాం అన్నారు. మావోయిజం ఎప్పటికీ ముగిసిపోదని ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అని స్పష్టం చేశారు. అజ్ఞాతంలో ఉన్నవారికి సంబంధించి, ఇతర సమస్యలు ప్రభుత్వంతో చర్చించిన తర్వాత స్పందిస్తామని చెప్పారు.
