విధాత : ఆర్ధిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయడంలో తప్పులేదని, ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీలో ఆర్ధిక శ్వేతపత్రం పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. శ్వేత పత్రం వెల్లడితో రాష్ట్ర పరపతి తగ్గిపోతుందన్న భావన సరికాదన్నారు. ప్రజల పేరుతో చేస్తున్న లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోతున్నాయో ప్రజలకు తెలవాల్సివుందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా కొత్త ప్రభుత్వం ముందుకు సాగడానికి శ్వేతపత్రం ఉపకరిస్తుందన్నారు.
మిగులు రాష్ట్రం ఆరులక్షల కోట్ల అప్పులకు చేరిందని, అందమైన భవనాలు నిర్మిస్తే అభివృద్ధి కాదని, పేదల జీవన స్థితిగతులలో మార్పులు తేలేని అప్పులు నిరర్దకమన్నారు. సింగరేణి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయాల్సివుందన్నారు. పేదల సంపదను పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేయాలన్నారు. ఆకలి సూచికలో దేశం 101వ స్థానంలో ఉందని, ఇంకా అర్ధాకలితో చాలమంది చనిపోతున్నారన్నారు. పేదలు పేదలుగానే ఉండిపోతుండగా కొందరి వద్దనే సంపద లక్షల కోట్లు పోగు పడుతుందన్నారు. కార్పోరేట్ సంస్థలు, వ్యక్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతున్నారన్నారు. శ్రమ కార్మికులది సంపద పెద్దలదవుతుందని ఇదేమి న్యాయం అని ప్రశ్నించారు.
ఈ రకమైన ఆర్ధిక అసమానతలను నిర్మూలించాల్సివుందన్నారు. ఔట్ సోర్సింగ్ ద్వారా గత ప్రభుత్వంలో శ్రమ దోపిడి జరిగిందన్నారు. ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజన వర్కర్లు వంటి వారందరి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్పొరేట్ సంస్థలు వేలకోట్ల లాభాలు గడిస్తున్నాయని టాక్స్ సక్రమంగా కట్టడం లేదన్నారు. వీటిపై దృష్టి పెట్టాలన్నారు. జీఎస్టీలో 18 లక్షల కోట్లు మనం కడుతున్నామని, మూడు శాతం సంపన్న వర్గం కడుతుంటే మిగిలిందంతా పేద మధ్యతరగతి వర్గాల కడుతున్నాయన్నారు.
మళ్లీ ఆ జీఎస్టీ నుంచి పొరపాటున సబ్సిడీ ఇస్తే పేదలను సబ్సిడీలతో సోమరిపోతులను చేస్తున్నారంటారన్నారు. కార్పొరేట్లకు మాత్రం రుణాలు మాఫీ, సబ్సిడీలు అందిస్తున్నారు. సంపద వికేంద్రీకరణ చేసి కొందరి దగ్గరనే లక్షల కోట్లు పోగు కాకుండా చూస్తే..పేదల కోసం ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా తప్పు లేదన్నారు. శ్వేతపత్రంలో లెక్కలు తప్పులుగా పొందుపరచడం సరికాదన్నారు. రాజకీయ లక్ష్యాల కంటే ఆర్ధిక క్రమశిక్షణ దిక్సూచీగా శ్వేతపత్రాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.