విధాత : ఖమ్మం జిల్లా సీపీఎం నేత, రైతు సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి సామినేని రామారావు హత్యకు గురయ్యారు. చింతకాని మండలం పాతర్లపాడులో శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన రామారావును దుండగులు కత్తులతో పొడిచి, గొంతుకోసి హత్య చేశారు. రామారావు రెండుసార్లు రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శిగా, పాతర్లపాడు సర్పంచ్‌గా పనిచేశారు. ఖమ్మం సీపీ సునీల్ దత్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్, పొన్నం వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నేతలు రామారావు కుటుంబాన్ని పరామర్శించారు. రామారావు హత్యతో ఉద్రిక్తతలు నెలకొనకుండా పాతర్లపాడులో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో హింసా రాజకీయాలకు తావు లేదు: భట్టి విక్రమార్క
సామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు తావులేదని.. దోషులను పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు.
మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లాలో హత్యా రాజకీయాలు చోటుచేసుకోవడంపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధిస్తున్నాయి. సీపీఎం పార్టీ అధికార పార్టీపైనే అనుమానాలు వ్యక్తం చేస్తుంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే రామారావు హత్య జరిగిందనిఆరోపిస్తుంది.
