కత్రన్ గట్ట బూటకపు ఎన్‌కౌంటర్‌ను ఖండించండి: శ్రీనివాస్

గడ్ చిరోలీ విప్లవోద్యమంలో అసువులు ధారపోసిన యువ విప్లవకారులు కామ్రేడ్స్ వాసు, కమల, రేష్మా త్యాగాలను ఎత్తిపట్టండంటూ భారత కమ్యూనిస్టు పార్టీ

  • Publish Date - May 21, 2024 / 04:48 PM IST

ఆపరేషన్ కగార్ పేరుతో సైనిక క్యాంపెయిన్
వరుస బూటకపు ఎన్‌కౌంటర్లు
నరసంహారానికి బీజేపీ ప్రశంసలు
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నేత శ్రీనివాస్

విధాత ప్రత్యేక ప్రతినిధి: గడ్ చిరోలీ విప్లవోద్యమంలో అసువులు ధారపోసిన యువ విప్లవకారులు కామ్రేడ్స్ వాసు, కమల, రేష్మా త్యాగాలను ఎత్తిపట్టండంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పశ్చిం సబ్-జోనల్ బ్యూరో, గడ్ చిరోలీ, దండకారణ్యం అదికార ప్రతినిధి శ్రీనివాస్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒకవైపు ఛత్తీస్ గడ్, మరోవైపు మహారాష్ట్రలలో పోలీసులు విచ్చలవిడిగా ప్రజలను కాల్చి చంపుతున్నారు.

గత ఐదు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న దండకారణ్య విప్లవోద్యమాన్ని తుదముట్టించే దుష్ట సంకల్పంతో పోలీసులు గత 5 మాసాలుగా ఆపరేషన్ కగార్ పేరుతో ఒక ప్రత్యేక సైనిక క్యాంపెయిన్ కొనసాగిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా పోలీసులు ఛత్తీస్ గఢ్ లో నరసంహారం సాగిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్ చిరోలీలో పోలీసులు విప్లవకారులను పట్టుకొని కాల్చి చంపుతున్నారు. ఈ అన్ని రకాల హత్యలను, మానవ సంహారాన్ని ఖండించవలసిందిగా, వీటికి వ్యతిరేకంగా ఉద్యమించవలసిందిగా ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు మా పార్టీ పశ్చిం సబ్ జోనల్ బ్యూరో, గడ్ చిరోలీ, దండకారణ్యం విజ్ఞప్తి చేస్తోంది.

గడ్ చిరోలీ జిల్లా, భామ్రాగఢ్ తాలూకా కత్రన్ గట్టలో స్థానిక దళ కమాండర్, డివిజనల్ కమిటీ మెంబర్, డివిజనల్ కమాండర్ ఇన్ ఛీఫ్ కామ్రేడ్ వాసు (సతీష్ కొర్చా) తో పాటు కామ్రేడ్స్ కమల పుల్సూరీ, రేష్మా మడ్కాం లను సజీవంగా పట్టుకొని పోలీసులు కాల్చి చంపారు. పెరిమిలీ దళం తుడిచిపెట్టుకుపోయిందనీ ప్రకటించారు. ఈ బూటకపు ఎన్ కౌంటర్ ను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వీటికి వ్యతిరేకంగా మే 30 నాడు ప్రజలు ముందుకు రావలసిందిగా పిలుపునిస్తున్నది. కాకూర్-టేకమెట్ట అడవిలో పోలీసుల కాల్పులలో అసువులు బాసిన మా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు గ్రామీణుల సంస్మరణలో ఆ రోజు పాటించే సంతాపదినంతో పాటు కత్రన్ గట్ట హత్యలను ఖండించాల్సిందిగా కోరుతోంది.

కామ్రేడ్ వాసు (మధు, సమర్) తూర్పు బస్తర్ డివిజన్ బోధ్ ఘాట్ ఏరియాకు చెందిన సుడ్ లా గొడియా గ్రామం నుండి 2008లో పీ.ఎల్.జీ.ఏ లో భర్తీ అయ్యాడు. అప్పటికి కామ్రేడ్ వాసు 16 సంవత్సరాల యువకుడు. అతడు పార్టీ ప్రారంభించిన ప్రాథమిక కమ్యూనిస్టు శిక్షణ పాఠశాలలో 6 మాసాల శిక్షణా కోర్సును పూర్తి చేసిన తొలి బ్యాచ్ కామ్రేడ్. ఆ తరువాత ఆయన 2009 అక్టోబర్ లో నాయకత్వ కామ్రేడ్ రక్షణ సిబ్బందిలో చేరి 2021 మధ్య వరకు అంటే దాదాపు 12 సంవత్సరాల కాలం కొనసాగాడు. 2021 మధ్య నుండి 2024 మే 13న తుదిశ్వాస విడిచే వరకు గడ్చిరోలీ డివిజన్ లో పెరిమిలీ దళ బాధ్యుడిగా (డీవీసీఎం) బాధ్యతలు చేపట్టి గత 4 మాసాలుగా డివిజనల్ కమాండర్ ఇన్ చీఫ్ గా కూడ బాధ్యతలు కొనసాగించాడు.

విప్లవోద్యమంలో దాదాపు దశాబ్దమున్నర కాలానికి పైగా పాల్గొని వివిధ బాధ్యతలు చేపట్టి యవ్వన ప్రాయంలోనే శత్రువు జరిపిన బూటకపు ఎన్ కౌంటర్ లో అమరుడైన కామ్రేడ్ వాసు విప్లవ సేవలు చిరస్మరణీయమైనవి. ఆయనలోని చొరవ, పట్టుదల, నిర్మాణ క్రమశిక్షణ, సైనిక రంగంలో మక్కువ, నూతన విషయాలు నేర్చుకోవాలనే నిత్య తపన – కృషి, సిద్ధాంత, రాజకీయ అధ్యయన ఆసక్తి నూతన తరాలకు ఆదర్శవంతమైనవి. ఆయన అమరత్వంతో గడ్చిరోలీ డివిజన్ ఉద్యమం ఒక మంచి భవిష్యత్తు వున్న విప్లవకారుడిని కోల్పోయినప్పటికీ, ఆయన చెప్పిన రాజకీయాలతో తర్ఫీదైన నేటి తరం యువతీ యువకులు ముందుకు వచ్చి ఆయన లేని లోటును తీరుస్తారనీ మా పార్టీ బలమైన విశ్వాసంతో వుంది.

కామ్రేడ్స్ కమల, రేష్మాలు సైతం యవ్వన ప్రాయంలోనే పీ.ఎల్.జీ.ఏ.లో భర్తీ అయ్యారు. కామ్రేడ్ కమల 2015లో పశ్చిం బస్తర్ డివిజన్ లోని ఔకెం నుండి, కామ్రేడ్ రేష్మా 2018లో దక్షిణ బస్తర్ డివిజన్ బుడిగిన్ నుండి భర్తీ అయ్యారు. వారు తమకు తెలియని ప్రాంతమైనప్పటికీ, ప్రజలతో లోతైన పరిచయాలు లేనప్పటికీ, భౌగోళిక పరిస్థితుల గురించి అవగాహన లేనప్పటికీ నిస్సంకోచంగా గడ్చిరోలీ చేరుకొని పార్టీ ఇచ్చిన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఇద్దరు కామ్రేడ్స్ ఎంతో విశ్వాసంతో, పట్టుదలతో ప్రజల మధ్యకు వెళ్లి పనిచేస్తున్న క్రమంలోనే కత్రన్ గట్ట లో జరిగిన పోలీసుల బూటకపు ఎన్ కౌంటర్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

వరుస బూటకపు ఎన్‌కౌంటర్లు

గడ్ చిరోలీ జిల్లా పోలీసులు మే 13 నాడు కత్రన్ గట్టలో ముగ్గురిని బూటకపు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపారు. మార్చ్ 19 నాడు అహెరీ తాలూకా లింగంపెల్లిలో నమ్మక ద్రోహి చేసిన ద్రోహంతో నలుగురు కామ్రేడ్స్ ను పోలీసులు సజీవంగా పట్టుకోగలిగి వారినీ బూటకపు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. మరోవైపు సరిహద్దులలోని నారాయణ్ పుర్ జిల్లా కాకూర్-టేకమెట్ట అడవిలో తమ సంప్రదాయ పండుగ జరుపుకోవడానికి స్త్రీ పురుషులు చేరుకోగా నలుగురు ఆదివాసీ యువకులను వారి ముందే వెంటాడి, వేటాడి చంపారు.

ఇదే రోజు ఇదే ప్రాంతంలో ఆరుగురు పార్టీ, పీఎల్ జీఏ కామ్రేడ్స్ ను కాల్చి చంపారు. మే 10 నాడు బీజాపుర్ జిల్లా పిడియా అడవిలో తునికాకు సేకరించుకునే 12 మంది గ్రామస్థులను వేలాది పోలీసు-కమాండో బలగాలు చుట్టుముట్టి కాల్చి చంపారు. అడవులలో ఆదివాసీ ప్రజలను కాల్చి చంపుతూ వారి శవాల పక్కన బర్మార్లు, విస్ఫోటక పదార్థాలు, విప్లవ సాహిత్యం చేర్చి తాము జరిపిన హత్యలకు సాధికారత కోసం వారిని తలలకు వెలలు ప్రకటితమైన మావోయిస్టులుగా కట్టుకథలు అల్లుతూ పోలీసులు అధికారిక ప్రకటనలు జారీ
చేస్తున్నారు.

విచ్చలవిడిగా హత్యలు

విశాల అటవీ ప్రాంతాలలో కౄరమైన అడవి జంతువుల మధ్య తరతరాలుగా జీవిస్తున్న ఆదివాసీలు తమ ఆత్మరక్షణ కోసం విల్లంబులు, బర్మార్లు పట్టుకొని అడవికి వెళ్లడం సర్వసాధారణం. అలాంటి ఆదివాసీలను సాయుధ మావోయిస్టులుగా పరిగణిస్తూ క్రూర జంతువులకన్నా భయంకరంగా, విచ్చలవిడిగా హత్యలు చేస్తున్నారు. ప్రజలలో ఒక భయబీభత్స వాతావరణం నెలకొల్పి ప్రజల నుండి విప్లవకారులను ఒంటరి చేసి మరింత పెద్ద ఎత్తున వారిని హత్య చేయడానికి మార్గం సుగమం చేసుకోవడంలో భాగంగానే అడ్డూ అదుపు లేని, తమ చట్టం, రాజ్యాంగం ఆమోదించని మానవ సంహారాన్ని కొనసాగిస్తున్నారు.

నరసంహారానికి ప్రశంసలు

ప్రతి నరసంహారం తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మోదీని కొనియాడుతూ మావోయిస్టుల మరణాల లెక్కలు ప్రకటిస్తూ ప్రభుత్వ ఆమోదాన్ని తెలుపుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శవాల కౌంటింగ్ కోసం తహతహలాడే పోలీసు అత్యున్నతాధికారులు ఈ చర్యలను ప్రశంసిస్తున్నారు. వీరికి వంత పాడుతూ కొంత మంది మీడియా పర్సన్స్ అడవులలో పోలీసులు దిక్కుతోచని పరిస్థితులలో ఒక పానిక్ వాతావరణంలో జరుపుతున్న కాల్పులలో గ్రామస్థులు మరణిస్తున్నారనీ స్టోరీలు తయారు చేసి ఖాకీ అధికారుల మెప్పు పొందుతున్నారు.

అఫ్ స్పా (AFSPA-సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం) అమలులో వున్న ఈశాన్య ప్రాంతంలో కొనసాగిస్తున్న తరహాలోనే హత్యాకాండ కొనసాగిస్తున్నారు. కశ్మీర్ ను మరిపించే తరహాలో అడవులలో ఎప్పటికప్పుడు నూతన పోలీసు క్యాంపులను నెలకొల్పుతూ ఖాకీమయం చేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండించాల్సిందిగా, మానవ సంహారాన్ని నిలిపివేయడానికి ఉద్యమించా
ల్సిందిగా ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, హక్కుల కార్యకర్తలకు, వకీళ్లకు, రచయితలకు, కళాకారులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, మేధావులకు ముఖ్యంగా ఆదివాసీ ప్రజా సంఘాలకు, ఆదివాసీ శ్రేయోభిలాషులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పార్టీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది.

Latest News