BV RAGHAVULU | బీజేపీ విస్తరణ ప్రమాదకరం , నిలువరించడంలో కాంగ్రెస్ విఫలం :సీపీఎం రాఘవులు

తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ నూతనంగా విస్తరించడం దేశానికి ప్రమాదకరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు వ్యాఖ్యానించారు

  • Publish Date - July 10, 2024 / 04:04 PM IST

విధాత, హైదరాబాద్ : తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ నూతనంగా విస్తరించడం దేశానికి ప్రమాదకరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఆ పార్టీ ఓటు బ్యాంకు 19 నుంచి 35 శాతానికి పెరగడం ప్రమాదకరమని, కేరళలో సైతం తొలిసారిగా ఒక సీటు గెలిచిందని, అక్కడ కమ్యూనిస్టులను కాంగ్రెస్ ప్రతిపక్షంగా చూడటంతో బీజేపీ గెలిచిందన్నారు. దేశంలో, తెలంగాణలో బీజేపీ విస్తరణను నియంత్రించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఇండియా కూటమి విచ్ఛిన్నం కాకుండా ముందుకు వెళ్లడంలో సీపీఎం చేసిన త్యాగం మరెవరూ చేయలేదని, పశ్చిమబెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్ సీట్లు సర్దుబాటు చేసుకున్నా కాంగ్రెస్‌కు చెందిన ఏ ఒక్క జాతీయ నాయకుడూ ప్రచారం నిర్వహించలేదని గుర్తు చేశారు. ఓట్లు, సీట్లు కాదు.. దేశాన్ని రక్షించుకోవడమే సీపీఎం లక్ష్యమన్నారు . కార్పొరేట్ శక్తులకు సేవకుడిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, రష్యా పర్యటనలో దేశమంతా అభివృద్ధి జరిగిందన్న మోదీ వ్యాఖ్యలు నిజమైతే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు సీట్లు తగ్గాయో ప్రధాని చెప్పాలని రాఘవులు ప్రశ్నించారు. సేట్లు ఎందుకు తగ్గాయనే ఆలోచన, ఆత్మవిమర్శ చేసుకోకుండా మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎన్నికలను బీజేపీ డబ్బుతో ముంచేసిందన్నారు. మతోన్మాదాన్ని తెలంగాణ ప్రజల మనసు నుంచి తీసివేసే బాధ్యత సీపీఎంపై ఉందని, తెలంగాణలో ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా.. గద్దెనెక్కుదామని బీజేపీ కాచుక్కూర్చుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ కుట్రలను తిప్పికొట్టేందుకు లౌకికశక్తులను సీఎం రేవంత్ రెడ్డి ఏకం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రజలపై కేంద్రం మోపిన భారాన్ని మరిచిపోయి.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కిషన్‌రెడ్డి వినిపించడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు పార్లమెంట్‌లో సమస్యల ప్రాతిపదికన అంశాల వారిగా బీఆరెస్ వ్యూహాలు ఉంటాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ చెబుతున్నారని, అలా స్పందించడం రాజకీయం కాదని, లొంగుబాటు అవుతుందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడితేనే బీఆరెస్‌కు మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు.