ధరణిలో దరఖాస్తుకూ వీలు లేని సమస్యలు
పది గ్రామాల్లో ఐదు నెలలపాటు లీఫ్ అధ్యయనం
మంథని గౌరెల్లిలో ముగిసిన పైలట్ ప్రాజెక్ట్
ప్రతి ఇంటికీ వైద్య పరీక్షల మాదిరిగా రెవెన్యూ రికార్డుల పరీక్షలు చేపట్టాలి
మీడియాతో భూమి చట్టాల నిపుణుడు సునీల్
భూమి సమస్యలు సృష్టించిన కేసీఆర్‌పై కేసు పెట్టే యోచన
ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి వెల్లడి
విధాత: ధరణిలో భూమి సమస్యలు నానాటికి పెరుగుతున్నాయి కానీ తరగడం లేదు. పైగా ధరణిలో ధరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేని సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ధరణిలో ధరఖాస్తుల పరిష్కారానికి బదులు తిరస్కారాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాస్తవంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటన్నది గుర్తించడానికి భూమి సునీల్ ఆధ్వర్యంలో లీఫ్ సంస్థ రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని 10 గ్రామాల్లో 5 నెలల పాటు అధ్యయనం చేసింది. అనేక మంది లీఫ్ సంస్థ న్యాయవాదులు గ్రామాలకు వెళ్లి న్యాయ శిబిరాలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. ఇలా చేపట్టిన అధ్యయన కార్యక్రమం సోమవారంతో లీఫ్ సంస్థ ముగించింది. లీఫ్ న్యాయవాదుల బృందం ప్రతి గ్రామంలో మకాం వేసి రైతుల సమస్యలను అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి మార్గాలను వెతికే ప్రయత్నం చేసింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్ ద్వారా తీసుకున్నారు.
ఒక్కో అప్లికేషన్‌ను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి పొరపాట్లు, సమస్యలు, పరిష్కార మార్గాలను రూపొందించారు. 12 రకాలుగా క్యాటగిరీ చేసిన అప్లికేషన్ ఫారం ద్వారా అనేక కేస్ స్టడీస్‌ను అధ్యయనం చేశారు. పైలట్ ప్రాజెక్టును రెండు దశలుగా పూర్తి చేశారు. మొదట అప్లికేషన్ల స్వీకరణ, రెండోది వారి దగ్గరున్న డాక్యుమెంట్ల ఆధారంగా రిపోర్ట్ తయారు చేయడం. ఈ రెండు దశలు పూర్తయినట్లు ధరణి కమిటీ సభ్యుడు, భూ చట్టాల నిపుణుడు ఎం సునీల్ కుమార్ ప్రకటించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంథని గౌరెల్లిలో పైలట్ ప్రాజెక్టు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇన్ని రోజులుగా లీఫ్ బృందం చేసిన కృషిని మీడియాకు వివరించారు. ఇక మూడు, నాలుగో దశలు మిగిలి ఉన్నాయన్నారు. ఇక్కడ గుర్తించిన ప్రతి సమస్యకు తగిన రిపోర్టును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమర్పించనున్నట్లు చెప్పారు. వాటిని రెవెన్యూ యంత్రాంగం ద్వారా అమలయ్యేటట్లు ప్రయత్నిస్తామని తెలిపారు.
యాచారం మండలంలోని 10 గ్రామాల్లో తాము చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి మార్గాన్ని చూపిస్తున్నట్లు భూమి సునీల్ ప్రకటించారు. ధరణి మాడ్యూళ్ల ద్వారా అప్లై చేసుకోవడం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. ప్రతి గ్రామంలోనూ రెండు రకాలుగా సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయని చెప్పారు. తాము చేపట్టినట్లుగా గ్రామంలో శిబిరం ద్వారా అప్లికేషన్లు స్వీకరించి, రిపోర్టులు రూపొందించొచ్చన్నారు. ‘వందకు వంద శాతం సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలంటే ఇంటింటికీ వెళ్లి వారి భూ రికార్డులను పరిశీలించాలి. వారి దగ్గరున్న డాక్యుమెంట్లకు, రెవెన్యూ రికార్డులకు మధ్య ఎంత తేడా ఉన్నదో చూడాలి. ఆ సమస్యలకు ఆ వెంటనే పరిష్కార మార్గాలను చూపాలి. ప్రతి ఇంటికీ వైద్య పరీక్షల మాదిరిగా రెవెన్యూ రికార్డుల పరీక్షలు చేపట్టాలి’ అని సునీల్ చెప్పారు. 2016లో తాము వరంగల్‌లో ఇంటింటికీ వెళ్లి ఇలాగే పరీక్ష చేస్తే ఆరు గ్రామాల్లోని పహాణీలు, 1 బీ రికార్డుల్లో 12 వేల తప్పులు గుర్తించామని తెలిపారు. అప్పటికప్పుడు మార్క్ చేయడం ద్వారా పరిష్కరించినట్లు చెప్పారు. అలా చేయడం ద్వారా ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి అవకాశం ఉందన్నారు.
2003-05 మధ్య కాలంలో భూమి సునీల్ ఆధ్వర్యంలో అసైన్డ్ ల్యాండ్స్ పైనా డీఆర్డీఏ సహకారంతో స్టడీ చేశారు. ప్రజల భాగస్వామ్యంతో కమ్యూనిటీ కో ఆర్డినేటర్లను వినియోగించారు. అలాగే 2012-13 కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 9 మండలాల్లో గిరి ప్రగతి, గిరి న్యాయం అనే ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ల్యాండ్ సర్వే కూడా పూర్తి చేశారు. సెర్ప్‌లో పని చేస్తున్న కో ఆర్డినేటర్లు, పారా లీగల్స్ సేవలతో సక్సెస్ అయ్యారు. ఈ అధ్యయనాలకు కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ ప్రశంసలు దక్కాయి. రాష్ట్రంలో శిక్షణ పొందిన 110 మంది కమ్యూనిటీ సర్వేయర్లు, 133 మంది పారా లీగల్స్, ఆరుగురు లీగల్ కో ఆర్డినేటర్లు ఉన్నారు. వీరంతా భూ సమస్యలపైన పని చేశారు. గతంలో మండల సమాఖ్యలు కూడా భూమి ఎజెండాగా పని చేశాయి. అప్పటి కేంద్ర మంత్రి జై రాం రమేష్ ఆధ్వర్యంలో కడప, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు పైలట్ ప్రాజెక్టులు నడిచాయి. వాటి ఆధారంగానే రైతు సదస్సులు చేపట్టి 12 లక్షల దరఖాస్తులను పరిష్కరించారు. ప్రభుత్వం కూడా వీరి సేవలను సరైన పద్ధతిలో వినియోగించుకుంటే మెరుగైన ఫలితాలు దక్కుతాయన్న అభిప్రాయం ఉన్నది. పైగా ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేందుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి రాబట్టేందుకు చాన్స్ ఉన్నట్లు సునీల్ వివరించారు. భూ న్యాయ శిబిరం ముగింపు కార్యక్రమంలో ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరెడ్డి, లీఫ్ సంస్థ ప్రతినిధులు జీ జీవన్ రెడ్డి, కొంపెల్లి మల్లేశ్, వీ ప్రవీణ్, ఈరుగు రవి పాల్గొన్నారు.
వచ్చే అసెంబ్లీలోనే కొత్త ఆర్వోఆర్ చట్టం
బీఆరెస్ తీసుకువచ్చిన 2020 ఆర్వోఆర్ చట్టం ద్వారా లక్షల మంది రైతులు రోడ్డున పడ్డారని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజలకు సత్వర సేవలు అందించే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. నూతన ఆర్వోఆర్ చట్టం డ్రాఫ్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత భూమి హక్కులు హరించుకుపోయాయని చెప్పారు. ఐదేళ్ల నుంచి లక్షల మందికి వారి సొంత భూములే అమ్ముకోవడానికి వీల్లేకుండా మాజీ సీఎం కేసీఆర్ చేశారని విమర్శించారు ఆయన తప్పుడు విధానాల ద్వారా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అందుకే కేసీఆర్‌పై కేసు పెట్టే యోచనలో ఉన్నామన్నారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో భూ సమస్యలన్నింటికీ ఆయనే కారణమని ఆరోపించారు.
టెర్రాసిస్ అనే దివాలా తీసిన విదేశీ కంపెనీకి అత్యంత విలువైన భూ రికార్డులను, డాటాను అప్పగించారన్నారు. ఆర్వోఆర్ 2020 లో మార్గదర్శకాలు కూడా జారీ చేయలేదని విమర్శించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ విషయాన్ని ఎలుగెత్తామని గుర్తు చేశారు. ధరణిలోని లోపాలను సరిదిద్ది కొత్త వ్యవస్థను రూపొందిస్తామని రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. తప్పులు పునరావృతం కాకుండా మెరుగైన వ్యవస్థను అమలు చేసేందుకే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య అంశాన్ని తీసుకొని ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. భూ సమస్యల పరిష్కారానికి భూమి సునీల్ ఆధ్వర్యంలో లీఫ్స్ సంస్థ యాచారం మండలంలోని 10 గ్రామాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని కొనియాడారు. ఈ రిపోర్టును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమర్పించి సమస్యలు పరిష్కారమయ్యేటట్లు చూస్తామన్నారు.
యాచారం మండలంలోని 10 గ్రామాలలో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ లో వచ్చిన దరఖాస్తులు ఇవి
గ్రామం పేరు | దరఖాస్తుల సంఖ్య |
యాచారం | 291 |
మంథన్ గౌరెల్లి | 236 |
మొండి గౌరెల్లి | 120 |
కుర్మిద్దా | 378 |
తాటిపత్రి | 254 |
మేడిపల్లి | 204 |
తక్కెలపల్లి | 96 |
చింతపట్ల | 255 |
గుంగాల్ | 247 |
నంది వనపర్తి | 119 |
మొత్తము | 2,200 |