తెలంగాణలో ఉపాధ్యాయ, విద్యారంగానికి నిరాశ

కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తే నిరాశ మిగిలిందని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ అన్నారు

  • Publish Date - January 24, 2024 / 02:12 PM IST

– రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు విజయవంతం చేయాలి

– టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తే నిరాశ మిగిలిందని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ అన్నారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఖమ్మంలో జరిగే టీపీటీఫ్ రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభల గోడ పత్రికను బుధవారం హనుమకొండలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భోగేశ్వర్ మాట్లాడుతూ 1944లో ఏర్పడిన ఎపీటీఎఫ్ 7 దశాబ్దాలుగా విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంస్థాపరంగా విద్యా వ్యాప్తికి ఐక్యవేదిక ద్వారా ఎన్నో ఉద్యమాలు నిర్వహించిందన్నారు. అందరికీ సమాన విద్య అందాలని ఎజెండాగా పనిచేసిందని అన్నారు. ఉపాధ్యాయ దర్శిని సంపాదకులు వీ అజయ్ బాబు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి బెల్లం కొండ రమేష్, పూర్వ ఉపాధ్యాయ దర్శిని సంపాదకులు బైరి స్వామి మాట్లాడుతూ అంతరాలు లేని విద్య ప్రజలకు ప్రధాన అంశంగా ఉచిత విద్య, కామన్ స్కూల్ విద్యా విధానం, శాస్త్రీయ విద్య కోసం ఖమ్మంలో జరిగే విద్యా వైజ్ఞానిక మహాసభలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యను కాంక్షించే వారందరూ తరలిరావాలని కోరారు.


అసమాన సమాజంలో సమాన విద్య, సాధ్యాసాధ్యాలు, అంతరాలులేని విద్య, ప్రజలకు ప్రభుత్వ బాధ్యత, ఫాసిజం-బుద్ధి జీవుల పాత్ర, మహిళా స్థితిగతులు కర్తవ్యాలు లాంటి అంశాల మీద ప్రొఫెసర్ బుర్ర రమేష్, ఏ నరసింహారెడ్డి, ప్రొఫెసర్ కాశీం, వేణుగోపాల్, ప్రసాద్ తదితర విద్యా మేధావులు ప్రసంగిస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యాభిమానులు సమాజంలో మార్పును కాంక్షించే సందేశాలుంటాయన్నారు. ఖమ్మంలో జరిగే విద్య వైజ్ఞానిక మహాసభలకు ఉపాధ్యాయులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ వెంకటేశ్వర్లు, పూజారి మనోజ్, ఉపాధ్యక్షులు జే స్వామి, వీ రవీందర్, జీ లక్ష్మిపతి, కార్యదర్శులు డీ మల్లయ్య, బందు ప్రసాద్, ఈదుల వీరాస్వామి, ఉమ్మడి జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి ఉత్కూరి అశోక్, బిమళ్ల సారయ్య, సురేష్ గుప్త, ఛక్రు నాయక్, జీ రాజేష్ పాల్గొన్నారు.