Etela Rajender | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల?

బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు రేపు అధికారికంగా ప్రకటన వెలువడనుందని భావిస్తున్నారు

  • Publish Date - June 9, 2024 / 05:50 PM IST

కేంద్ర మంత్రి పదవి ఆశించిన ఈటల

విధాత: బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు రేపు అధికారికంగా ప్రకటన వెలువడనుందని భావిస్తున్నారు. ఇదే విషయమై ఆదివారం ఉదయం ఈటల రాజేందర్ తో ఫోన్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. అధిష్టానం దూతగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస శర్మ ఈటల రాజేందర్ తో చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని శర్మ సూచించారు.

తెలంగాణలో అధికారం లోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే బాధ్యత స్వీకరించాలని కోరినట్లు తెలిసింది. దీనికి ఈటల కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రేపు ఈటెల రాజేందర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కేంద్ర మంత్రి పదవి ఆశించిన ఈటల

వాస్తవానికి ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కి అవకాశం కల్పించారు. వీరిద్దరూ సీనియర్ ఎంపీలుగా ఉన్నారు. దీంతో ఈటల కొంత నిరాశకులోనైనట్లు భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా నియమించేందుకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బీజేపీ అధిష్టానం బీసీ ముఖ్యమంత్రిని ఎజెండాపైకి తెచ్చారు. అప్పుడు కూడా ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు చర్చకు వచ్చాయి. కానీ బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. అయితే బీజేపీ ఫ్లోర్ లీడర్ గా మాత్రం బీసీ సామాజిక వర్గానికి కేటాయించకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డిని నియమించడం గమనార్హం.

Latest News