Site icon vidhaatha

మల్కాజిగిరి ప్రజల ఆదరణ మరువలేను: ఈటల

గెలుపుపై ఈటల రాజేందర్ ధీమా

విధాత, హైదరాబాద్‌ : మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థిగా ప్రజలు నన్ను ఆదరిస్తున్న తీరు మరువలేనని ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం, బాల నగర్ డివిజన్‌లో ఈటల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు వెంట రాగా మండుటెండల్లో ఆయన తన ప్రచారం కొనసాగించారు. పలు వార్డుల్లోని స్థానికులు ఈటలకు పూలమాలలతో స్వాాగతం పలుకగా, మహిళలు మంగళహారతులు పట్టారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిగా ఏ ఇంటికి వెళ్లిన ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. ఈసారి దేశం కోసం, మోదీ కోసం బీజేపీకి ఓటు వేస్తామని అంటున్నారని చెప్పారు. ప్రచారంలో మంగళ హారతులతో స్వాగతం పలికిన ఆడబిడ్డలకు, పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పదేళ్ల అవినీతి రహిత..మచ్చలేని పాలనలోనే దేశం మరింత ప్రగతి సాధిస్తుందన్న విశ్వాసంతో ప్రజలు బీజేపీని గెలిపించాలని నిర్ణయించుకున్నారన్నారు.

ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, ప్రలోభాలు చేస్తున్నా ప్రజలు మాత్రం ఇప్పటికే బీజేపీకి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారన్నారు. మల్కాజిగిరిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆయన గుర్తు చేశారు. దేశ భద్రత, సుస్థిర, సుపరిపాలనకు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మల్కాజిగిరిలో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రధాని మోదీ అండతో నియోజకవర్గం సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తానన్నారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను కాపాడేది మన మోదీ మాత్రమేనన్నారు. వెనుకబడిన వర్గాల సంపదను లెక్కించి, అదంతా మరో వర్గం వారికి దోచిపెట్టాలనే దుష్ట ఆలోచన కాంగ్రెస్ పార్టీదన్నారు. మన ఆస్తులను, హక్కులను, ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడం కోసం కాంగ్రెస్ ను ప్రశ్నించి, మన మోదీని గెలిపించుకుందామని ఈటల పిలుపునిచ్చారు.

Exit mobile version