Site icon vidhaatha

Malla Reddy | చంద్ర‌బాబుతో మ‌ల్లారెడ్డి కూడా భేటీ..! బీఆర్ఎస్‌ను వీడేనా..?

Malla Reddy | తెలంగాణ‌( Telangana )లో రాజ‌కీయాలు( Politics ) ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. జీహెచ్ఎంసీ మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డి( Teegala Krishna Reddy ).. టీడీపీ( TDP )లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇక తీగ‌ల కృష్ణారెడ్డి వెంట మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి( Malla Reddy ), ఆయ‌న అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి( Marri Rajashekhar Reddy ) కూడా వెళ్లారు. ఈ ముగ్గురు క‌లిసి చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు.

అయితే చంద్ర‌బాబుతో భేటీ అనంత‌రం తీగ‌ల కృష్ణారెడ్డి మాత్ర‌మే మీడియాతో మాట్లాడారు. కృష్ణారెడ్డితో పాటు మ‌ల్లారెడ్డి, రాజశేఖ‌ర్ రెడ్డి కూడా ఉన్న‌ప్ప‌టికీ, మామఅల్లుళ్లు మాత్రం మీడియాతో మాట్లాడలేదు. కేవ‌లం త‌న మ‌నువ‌రాలి పెళ్లి ప‌త్రిక ఇచ్చి, ఆహ్వానించేందుకు మాత్ర‌మే వ‌చ్చాన‌ని మ‌ల్లారెడ్డి ఒక్క మాట‌లో ముగించేశారు. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూతురు పెళ్లి నేప‌థ్యంలో గ‌త కొద్ది రోజుల నుంచి మ‌ల్లారెడ్డి ప్ర‌ముఖుల‌కు పెళ్లి ప‌త్రిక‌లు అంద‌జేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే మ‌ల్లారెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి గ‌తంలో టీడీపీలో చేరుతార‌ని వార్త‌లు షికారు చేసిన విష‌యం విదిత‌మే. తాజాగా మామఅల్లుడు చంద్ర‌బాబుతో భేటీ కావ‌డం.. వారు కారు దిగి సైకిల్ ఎక్కుతార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ మ‌ల్లారెడ్డి మాత్రం ఆ వార్త‌ల‌ను కొట్టిపారేస్తున్నారు.

చంద్ర‌బాబు వ‌ల్లే హైద‌రాబాద్( Hyderabad ) అభివృద్ధి చెందింది అని తీగ‌ల కృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ‌లో టీడీపీకీ భారీగా అభిమానులు ఉన్నార‌ని తెలిపారు. తెలంగాణ‌లో టీడీపీకి పూర్వ వైభ‌వం తీసుకొస్తామ‌ని తీగ‌ల కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. తీగ‌ల కృష్ణారెడ్డి గతంలో హుడా ఛైర్మన్‌​గా, హైదరాబాద్ నగర మేయర్‌​గా, ఎమ్మెల్యేగా పని చేశారు. 2014లో బీఆర్ఎస్‌( BRS Party )​లో చేరారు. 2024, ఫిబ్ర‌వ‌రిలో కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ( Congress Party ) తీర్థం పుచ్చుకున్నారు. తీగ‌ల కృష్ణారెడ్డి కోడ‌లు, రంగారెడ్డి జ‌డ్పి చైర్‌ప‌ర్స‌న్ తీగ‌ల అనితారెడ్డి( teegala Anitha Reddy ) కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

Exit mobile version