ఎన్నో వ్యయప్రయాసలతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో బూడిదైపోతే..ఆ రైతు కుటుంబం పడిన వేదన మాటల్లో చెప్పలేనిదిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిర్మల్ జిల్లా, పెంబి మండలంలో విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్ వల్ల కోతకి వచ్చిన 15 ఎకరాల మొక్క జొన్న పంట కాలిపోయింది.. కాలిపోయిన పంటను చూసిన బాధిత రైతు, అతని భార్య, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. చేతికందిన పంట బూడిదైపోవడంతో అన్నదాత పడిన ఆవేదన దృశ్యం.. గుండెలను పిండేసింది. బాధిత రైతు కుటుంబ సభ్యులంతా విలపిస్తున్న దృశ్యాలు అందరిని కదిలించి కలిచి వేస్తున్నాయి. ప్రభుత్వం, అధికారులు ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రైతు కష్టం బూడిదపాలు..
వేసవిలో ఎండల తీవ్రత, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ల నేపథ్యంలో ఇటీవల తెలుగు రాష్ట్రాలలో మొక్కజొన్న పంటలు దగ్దమైన ఘటనలు వరుసగా చోటుచేసుకుని బాధిత రైతాంగాన్ని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడేశాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలంతో పాటు కారేపల్లి మండలం గుంపెల్లగూడెంలో ముగ్గురు రైతులకు చెందిన 8 ఎకరాల్లో పండిన మొక్కజొన్న పంట కాలి బూడిదైంది.అగ్ని ప్రమాదంలో సుమారు రూ.6 లక్షలకు పైగా మొక్కజొన్న కంకులు కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. చేనుతో పాటు విద్యుత్ మోటర్లు కూడా అగ్నికి కాలిపోయాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి(మ) జులేకల్‌లో సైతం ఈదురు గాలులతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి..ఒక పొలం నుంచి మరో పొలానికి మంటలు వ్యాపించి 30ఎకరాల మొక్కజొన్న అగ్నికి ఆహుతైపోయింది.
అటు ఏపీలోనూ..గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చినపాలెంలో విద్యుదాఘాతంతో దాదాపు 15 ఎకరాల మొక్కజొన్న అగ్నికి ఆహుతైంది. కొబ్బరిమట్ట విద్యుత్ వైర్లపై పడి ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న మొక్కజొన్న తోటకి అంటుకుంది. గాలి బాగా వీయడంతో సుమారు 13 ఎకరాల్లో కాపుకి వచ్చిన మొక్కజొన్న అంతా కాలిపోయింది. తమ పంటలు కాలిపోవడానికి విద్యుత్ అధికారులే కారణమని రైతులు ఆరోపించారు. విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉన్నాయని, వాటిని తక్షణమే సరిచేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని పంట నష్టపోయిన మొక్కజొన్న రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రైతు కష్టం బూడిదపాలు
15 ఎకరాల పంట చేతికి వచ్చే సమయంలో బూడిద అయిపోయింది… pic.twitter.com/IlVwbzILEl— Sarita Avula (@SaritaAvula) April 30, 2026
ఇవి కూడా చదవండి :
HMWSSB | హైదరాబాదీలకు అలర్ట్.. మే 2న తాగునీటి సరఫరా బంద్..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వ ‘నీలినీడలు’
