కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి ప్రాధాన్యత , 32వేల కోట్లతో రైతు రుణమాఫీ … మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి, పేదలు, మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత దక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ డీసీసీబీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన కుంభం శ్రీనివాస్‌రెడ్డిని కోమటిరెడ్డి అభినందించారు.

  • Publish Date - July 1, 2024 / 03:33 PM IST

డీసీసీబీ పురోగతికి చేయూత
వందకోట్ల భూమిలో బీఆరెస్ ఆఫీస్ అక్రమ నిర్మాణం
కూల్చివేతకు చర్యలు తీసుకోవాలి

విధాత : కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి, పేదలు, మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత దక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ డీసీసీబీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన కుంభం శ్రీనివాస్‌రెడ్డిని కోమటిరెడ్డి అభినందించారు. ఆగస్టు 15 నుండి రైతులకు రెండు లక్షల రుణమాఫీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని, 32 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయనున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 70 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పు ఏడు లక్షల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. తెలంగాణ రైతులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులతోపాటు, అన్ని రకాల పంటలు పండించే రైతులకు డీసీసీబీ బ్యాంకు చైర్మన్‌గా సేవ చేసే అవకాశముంటుందన్నారు. గతంలో 1000కోట్ల విద్యా రుణాలు డీసీసీబీ ద్వారా ఇవ్వడం జరిగిందని, దాన్ని ఈ దఫా అధిగమించాలన్నారు. ప్రస్తుతం 25 కోట్ల రూపాయలతో బ్యాంకు ముందుకు సాగుతున్నదని, ఈ మొత్తాన్ని 300 కోట్ల తీసుకెళ్లాలని చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. నా సహకారంతో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహకారం, రాజగోపాల్ రెడ్డి మద్దతుతో పాటు మిగతా ఎమ్మెల్యేల సహకారం సంపూర్ణంగా ఉంటుందన్నారు. పదవి వచ్చిన తర్వాత పదవికి న్యాయం చేయాలని, పదవి ఎన్ని రోజులు ఉన్నది అనేది ముఖ్యం కాదన్నారు.

బీఆరెస్ ఆఫీస్‌ను కూల్చివేయండి

నల్లగొండ పట్టణం నడిబొడ్డున.. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా 100కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో బీఆరెస్‌ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని, తక్షణమే నోటీసులిచ్చి దానిని కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవాలక్ష రూల్స్ పెడుతున్న మీరు.. 100 కోట్ల భూమిలో అనుమతి లేకుండా ఇంద్ర భవనం లాంటి పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతుల్లేకుండా నిర్మించిన బీఆరెస్‌ పార్టీ కార్యాలయం కూల్చివేత పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి సూచించారు. బీఆరెస్ వారు కోరితే పట్టణం బయట ప్రభుత్వ భూములు కేటాయించాలని సూచించారు. పట్టణం లోపల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించి పార్టీ కార్యాలయం కట్టడం సరికాదని, దానిని తొలగించి మహిళా హాస్టల్‌, ప్రభుత్వ కార్యాలయానికి వినియోగించుకోవాలన్నారు. బైపాస్ రోడ్డు ప్రజల కోసమే తప్ప కొద్దిమంది మేలు కోసం నిర్మిస్తుంది కాదన్నారు. నాకింత వరకు నా నియోజకవర్గంలో ఐదు గజాల స్థలం లేదన్నారు. నియోజకవర్గంలో, జిల్లా కేంద్రంలో నిమిషం కూడా కరెంటు కోతలు లేకుండా సరఫరాకు చర్యలు తీసుకోవాలని విద్యుత్తు అధికారులను ఆదేశించారు.

Latest News