రెండు పులుల మధ్య భీకర పోరు.. ఆడ పులి మృతి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడపాదడపా దర్శనమిస్తూ జిల్లా వాసులను పెద్దపులులు హడలెత్తిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే పలుమార్లు పశువుల మందపై దాడులు

  • Publish Date - January 7, 2024 / 12:37 PM IST

– రెండు పులుల మధ్య ఘర్షణ

– దరిగాం అటవీ ప్రాంతంలో సంఘటన

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడపాదడపా దర్శనమిస్తూ జిల్లా వాసులను పెద్దపులులు హడలెత్తిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే పలుమార్లు పశువుల మందపై దాడులు జరిపి గాయపరిచిన, చంపిన సంఘటనలు ఉన్నాయి. గతంలో కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో పత్తి ఎరుతున్న కూలీలపై దాడిచేసి ఇద్దరిని చంపిన ఘటనతో జిల్లాలో ఎక్కడ పులులు కనబడినా సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యేవారు. పలుసార్లు రోడ్డు దాటుతూ, నదీ తీరం వెంట సంచరిస్తున్న పులులు పలువురు జిల్లావాసుల కంటపడ్డాయి. కాని ఒక్కసారిగా అందరు ఉలికిపాటుకు గురయ్యే సంఘటన ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.


అటవీ ప్రాంతంలో రెండు పెద్ద పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ పెద్దపులి మృతి చెందింది. మృతి చెందిన ఆ పులి ఆడ పులి కావడం విశేషం. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన అటవీ శాఖను కలవరపెట్టడమే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలకలం కూడా రేపింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో ఇలా పులి మృతి చెందిన సంఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిది కావడం మరోవిశేషం. అయితే స్థానికుల ద్వారా పులి మృతి చెందిన విషయం తెలుసుకున్న అటవీ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు. కాళేశ్వరం జోన్ పులుల సంరక్షణాధికారి శాంతారాం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.


పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు పంపించారు. కాగా మృతి చెందిన ఈ ఆడ పులి వయసు రెండు సంవత్సరాలని, ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగి ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన విషయాలను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన ఆడపులి మృతి చెందినట్లు పంచనామా నిర్వహించిన పశువైద్యాధికారులు నిర్ధారించారు. రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడి ఆడ పులి మృతి చెందిందని, మృతికి ముందు ఒక పశువుపై దాడి చేసినట్లు తెలిపారు. శరీర భాగాలు హైదరాబాద్ ల్యాబ్ కి పంపించాం, రిపోర్ట్ ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని కాళేశ్వరం జోన్ పులుల సంరక్షణాధికారి శాంతారాం స్పష్టం చేశారు.