విధాత, వరంగల్ ప్రతినిధి: బీసీ హక్కుల సాధనకు పోరాటమే మార్గమని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పిలుపు నిచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కోరారు. జాతీయ ఓబిసి ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీసీల హక్కుల కోసం రౌండ్ టేబుల్ సమావేశం హనుమకొండలో జరిగింది. కొలా జనార్ధన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ మధుసూదన్ చారి మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీ జన సభ నాయకులు డాక్టర్ రాజారాం యాదవ్ మాట్లాడుతూ కులగణన చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ముందుకు రాకపోవడం వలన బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రతి ఏటా బీసీలకు 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బడ్జెట్లో 9వేల కోట్లు కేటాయించి అన్యాయం చేసిందన్నారు. ప్రొఫెసర్ తిరునహరి శేషు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ పై తమ వైఖరి ప్రకటించాలన్నారు.
మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సమ్మారావు, నాగపురి రాజు మౌళి గౌడ్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, ప్రొఫెసర్ విజయబాబు, ప్రొఫెసర్ సాంబమూర్తి, ప్రొఫెసర్ వీరస్వామి, డాక్టర్ రమేష్ ,ప్రొఫెసర్ గడ్డం కృష్ణయ్య, మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ప్రొఫెసర్ రాములు తదితరులు పాల్గొన్నారు.