హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పేదలు ఇండ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కింద పూర్తయిన ఇండ్లను త్వరలోనే అర్హులకు కేటాయిస్తామన్నారు. పూర్తికాని ఇండ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అందజేస్తామన్నారు. ఈ గృహ నిర్మాణ పథకాలు పేద, బడుగు వర్గాల సొంతింటి కలను సాకారం చేసి వారి జీవన ప్రమాణాలను పెంపొందిస్తాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.