విధాత : అసెంబీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాల నేపధ్యంలో బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికలపై ముందుకు ఫోకస్ పెట్టారు. గాయం నుంచి కోలుకున్నాక లోక్‌సభ ఎన్నికల సన్నద్దతకు వ్యూహ రచనలో గులాబీ బాస్ నిమగ్నమయ్యారు. పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన కేసీఆర్ గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ చేతిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలు సాధించి బీఆరెస్ సత్తా చాటాలని, కాంగ్రెస్‌కు రిటర్న్ గిఫ్టు ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం బీఆరెస్ తరపున 9మంది సిటింగ్ ఎంపీలు ఉన్నారు.
వీరిలో ఆరుగురిని మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సిటింగ్‌లకు సీట్లు ఇవ్వడంతో అసెంబ్లీ స్థానాల్లో నష్టపోయామనే భావనలో కేసీఆర్ ఉన్నారని, అందుకే సిటింగ్ ఎంపీలలో మార్పు తప్పదన్న ప్రచారం బలంగా వినిపిస్తుంది. అయితే ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు కన్ఫర్మ్ చేశారని సమాచారం. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో మెదక్ ఎంపీగా ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ స్థానం నుంచి పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, కేంద్రంలో హంగ్ వస్తే కీలక భూమిక పోషించాలన్న ఆసక్తితో కేసీఆర్ ఉన్నారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. సిటింగ్‌లలో తిరిగి చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డికి, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్‌రావుకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉందంటున్నారు.
గత ఎన్నికల్లో బీఆరెస్ ఓడిన స్థానాల్లో ముగ్గురికి కేసీఆర్ టికెట్లు ఓకే చేశారని, వారిలో కరీంనగర్ నుంచి వినోద్‌కుమార్, నిజామాబాద్ నుంచి కవితలకు, ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్ పోటీచేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే కవిత, వినోద్‌కుమార్‌లు ఎంపీ ఎన్నికల కోసం సన్నద్దమవుతున్నారు. గత ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆరెస్ అభ్యర్థిగా పోటీచేసిన బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరడంతో ఈ స్థానంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్కాజ్‌గిరి నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి యాదవ్ స్థానంలో మల్కాజ్‌గిరి నుంచి ఎవరు పోటీచేస్తారనే దానిపై రాని క్లారిటీ రాలేదు. సికింద్రాబాద్ నుంచి గత ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ పోటీ చేయగా, వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి సాయికిరణ్‌ను పోటీకి దింపాలని యోచిస్తున్నారు. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు అమిత్‌రెడ్డిని పోటీకి దింపే ఛాన్స్ ఉంది.
ఆ స్థానాలపై స్పెషల్ ఫోకస్
బీఆరెస్ పార్టీ ఇప్పటివరకు ఒక్కసారి గెలవని స్థానాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని 7అసెంబ్లీ స్థానాల్లో బీఆరెస్ గెలిచినందునా ఈ దఫా సీటులో గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ నేతలకు నిర్ధేశం చేశారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై పార్టీ సీనియర్ నాయకులతో కసరత్తు చేస్తున్న కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలపై కూడా ఆరా తీస్తున్నారు. మోదీ, సోనియా తెలంగాణ నుంచి పోటీచేస్తే అప్పుడు బీఆరెస్ ఎలాంటి వ్యూహాంతో ముందుకెళ్లాలనే దానిపై కూడా కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. ఇంకోవైపు పొరుగున ఉన్న మహారాష్ట్రలో బీఆరెస్‌కు కొంత అనుకూల వాతారణం ఉందన్న భావనతో ఉన్న కేసీఆర్ ఆ రాష్ట్రంలో కూడా లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను నిలపడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారని సమాచారం. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే బీఆరెస్‌లో లోక్ సభ ఎన్నికల ఫీవర్ కూడా ముందస్తుగానే మొదలైనట్లయ్యింది.