Site icon vidhaatha

Harish Rao | గ్రూప్స్‌, డిఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించండి: హరీశ్‌రావు

సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ

విధాత, హైదరాబాద్ : గ్రూప్స్, డిఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం గురించి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం శోచనీయమని లేఖలో పేర్కోన్నారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదన్నారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అభ్యర్థులు, నిరుద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలిగించే మాటలు చెప్పలేదని, సమస్యకు పరిష్కారం చూపలేదన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం వల్లనే నిరుద్యోగుల పోరాటం మొదలైందన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా గుర్తించాలని కోరుతున్నానని తెలిపారు. నిరుద్యోగులవి కొత్త డిమాండ్లు కావని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవే, రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రంథాలయాలకు, కోచింగ్ సెంటర్లకు వచ్చి ఇచ్చిన హామీలే’ అని అభ్యర్థులు, నిరుద్యోగులు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదని లేఖలో హరీశ్‌రావు ప్రశ్నించారు.

మీరు, మంత్రులు, అధికారం యంత్రాంగం మొత్తం ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను సంఘవిద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండటం దౌర్భాగ్యమన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సహా అభ్యర్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించడం, ఇనుపకంచెలు వేయడం, ముందస్తు అరెస్టులు చేయడం, ఎక్కడిక్కడ నిర్బంధించడం వంటి చర్యలు అప్రజాస్వామికమన్నారు. నిరుద్యోగుల బాధలను ప్రపంచానికి చూపించే జర్నలిస్టులను సైతం బెదిరించడం, అరెస్టులు చేయడం, వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అని, ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే అరెస్టులు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

హామీలిచ్చిన వారు పదవుల్లో..నిరుద్యోగులు రోడ్లపైన

నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరు కూడా పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడం రెచ్చగొట్టినట్లుగా ఉందని, . ఉద్యోగ సమస్యల గురించి పోరాటం చేసిన మోతీలాల్ అనే విద్యార్థి, గ్రూప్ 1,2,3 పోస్టులకు దరఖాస్తు చేసిన విషయాన్ని ఆధారాలతో సహా అభ్యర్థులు బయట పెట్టిన విషయాన్ని గుర్తించాలని కోరారు. నాడు హామీలు ఇచ్చినవారు నేడు పదవుల్లో ఉన్నారు కానీ, నిరుద్యోగులు మాత్రం ఇంకా రోడ్లపైనే ఉన్నారనే విషయాన్ని గుర్తించండన్నారు. మీరు కూడా నిరుద్యోగుల కోసం అప్పట్లో మౌన దీక్ష కు కూర్చున్న విషయం గుర్తున్నట్లు లేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తే మంచిదని హితవు పలికారు.

గ్రూప్ 1 మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో కాకుండా, 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరుతున్నానని, ఇది గతంలో మీరు చేసిన డిమాండ్ అని పేర్కోన్నారు. 1: 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమీ కాదని, గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని హరీశ్‌రావు తన లేఖలో గుర్తు చేశారు. ఇటీవల ఏపీలో సైతం నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో 1:15 గా పేర్కొన్నప్పటికీ, తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారన్నారు.
గ్రూప్ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3 కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని ఇచ్చిన మాటను నిలుపుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందన్నారు.

అలాగే జూలై చివరి వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయని, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష ఉందని, ఏడు రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని అంటున్నారని గుర్తు చేశారు. 25 వేల టీచర్ పోస్టులలో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని నిరుద్యోగులను ఎన్నికల హామీతో నమ్మించారని, మేము ఇచ్చిన 5వేల పోస్టులకు మరో 6వేలు కలిపి 11 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారని, మీరు మ్యానిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతున్నానన్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, ఆరు నెలలు దాటినా ఆ దిశగా అడుగులు పడలేదని, వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి తదనుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేయాలని, కోరుతున్నామని, నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ అమలు చేయాలని లేఖలో సీఎం రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు కోరారు. అలాగే ప్రభుత్వం వెంటనే జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని  కోరారు.

Exit mobile version