Site icon vidhaatha

Motkupalli Narasimhulu | కాంగ్రెస్ మాదిగలను విస్మరించడం బాధాకరం.. నాకు టికెట్ ఇవ్వకపోవడం కలచివేసింది

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు 5వేల నిరుద్యోగ భృతిని ప్రకటించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు నిరుద్యోగులు తల్లిదండ్రుల మాదిరి వ్యవహరించాలని కోరారు. ఆయా యూనివ‌ర్సిటీల్లో పోలీసులు ఉక్కుపాదం మోపి నిరుద్యోగుల‌ను దారుణంగా కొడుతున్నారని, నిరుద్యోగుల నిర‌స‌నల‌ను పోలీసులు అణిచివేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని మోత్కుప‌ల్లి పేర్కొన్నారు.

కష్టాల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గెలుపునకు కృషి చేశాన‌ని, నీతిగా గతంలో మంత్రిగా పనిచేసిన నాకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడం కలచివేసిందని, ముఖ్యంగా 80 లక్షల మంది ఉన్న మాదిగలకు అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఒక్క టికెట్ ఇవ్వకపోవడం బాధకరమన్నారు. వేల కోట్లు ఉన్నోడికే టికెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కనీసం బీసీలను పట్టించుకున్న పాపాన కాంగ్రెస్ పార్టీ లేద‌న్నారు. బీసీలలో ముదిరాజులు, గౌడ్స్, పద్మాశాలిలు ఉన్నా వారందరిని పక్కన పెట్టి రెడ్లకే ప్రాధాన్యత నిచ్చారన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బిక్షమయ్యగౌడ్, బీర్ల ఐలయ్యలకు సపోర్ట్ చేసి గెలిపించానని చెప్పుకొచ్చారు. లంచాలు, ఫైరవీలు డబ్బుపై ఆశ లేకుండా నా హయాంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశానన్నారు. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో నాకు పోటీ చేసే అవకాశం రాలేదని, తెలంగాణలో నేను ఎక్కడ పోటీ చేసినా నాకు పది వేల ఓట్ల మేజారీటీ వస్తుందన్నారు.

నాకు యాదగిరిగుట్టలో అర్ధ గజం భూమి లేదని, ఎలాంటి ఆస్తులు సంపాదించలేదని, ఇప్పుడున్న ఎన్నికల్లో కోట్లకు విలువ ఉంది తప్ప, ప్రజలకు సేవ చేసిన వాడికి విలువ లేదన్నారు. బడుగు బలహీన వర్గాల వారి తరఫున నేను ఎల్లప్పుడూ పోరాడుతానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు తన ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా అధికార కార్యాలయంలో ఉంచారన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం డిప్యూటీ సీఎంభట్టి ఫోటోను విస్మరిస్తున్నారని, ఇది చాలా బాధాకరం అని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు సమానంగా డిప్యూటీ సీఎం భట్టి వికమార్క ఫోటోను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. నా రాజకీయ భవిష్యత్తు కార్యచరణ పోరాటమే తప్ప ఏమీలేదని మోత్కుపల్లి నర్సింహులు వెల్లడించారు.

Exit mobile version